జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ముగిసింది. పలువురు బీజేపీ పెద్దలతో ఈ సందర్భంగా చర్చలు జరిగినట్లు జనసేన అధినేత చెప్పుకొచ్చారు. ఈ రోజు సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సహా పలు అంశాలపై చర్చించారు. రాజధాని అమరావతికి సంబంధించి చివరి రైతుకూ న్యాయం జరిగేదాకా జనసేన – బీజేపీ కలిసి పోరాడతాయని చెప్పారు పవన్ కళ్యాణ్.
ఏకైక రాజధాని అమరావతికే తాము కట్టుబడి వున్నామని, ఇదే విషయాన్ని బీజేపీ అధిష్టానం గతంలోనే స్పష్టం చేసిందని పవన్ వెంట ఢిల్లీకి వెళ్ళిన జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరు.? అన్నదానిపై కొద్ది రోజుల్లో స్పష్టత వస్తుందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు పవన్ కళ్యాణ్. పోలవరం ప్రాజెక్టు విషయంలో తలెత్తిన గందరగోళంపై జేపీ నడ్డాతో చర్చించామనీ, జాతీయ ప్రాజెక్టు గనుక పోలవరం ప్రాజెక్టు పూర్తి బాధ్యత కేంద్రానిదేనని జేపీ నడ్డా తమకు తెలిపినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
బీజేపీ – జనసేన కలిసి మరింత సమన్వయంతో ముందుకు వెళ్ళడంపై ఈ సమావేశంలో లోతైన చర్చ జరిగిందని జనసేనాని చెప్పారు. అయితే, జేపీ నడ్డాతో భేటీ సందర్భంగా బీజేపీకి చెందిన ఇతర ముఖ్య నేతలు (ఏపీకి సంబంధించి) ఎవరూ లేకపోవడం గమనార్హం. ‘గ్రేటర్ ఎన్నికల గురించి కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సహా పలు అంశాలపై చర్చ కోసమే ఢిల్లీకి వచ్చాం.. జేపీ నడ్డా ఆహ్వానం మేరకే ఢిల్లీకి రావడం జరిగింది..’ అని పవన్ కళ్యాణ్ మీడియా నుంచి వచ్చిన ప్రశ్నలకు బదులిస్తూ వెల్లడించారు.
ఏదిఏమైనా, ఢిల్లీకి వెళ్ళిన రెండ్రోజుల తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అపాయింట్‌మెంట్ దొరకడం, ఈ రెండు రోజుల్లో పవన్ – నాదెండ్ల మనోహర్, ఢిల్లీలో ఎవరెవర్ని కలిశారన్నదానిపై స్పష్టత లేకపోవడంతో రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఇదిలా వుంటే, బీజేపీ ముఖ్య నేతలు గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల ప్రచారానికి రానున్న దరిమిలా, మరోసారి జనసేన అధినేతతో బీజేపీ అగ్ర నేతల భేటీ వుండొచ్చన్న ప్రచారం జరుగుతోంది.