ఏం జరగబోతోంది.. ఒకే రోజు విశాఖలో చంద్రబాబు, పవన్

ఒకే వేదిక.. ఒకే తేదీ. అది విశాఖపట్నం, తేదీ జనవరి 26. రెండు పవర్ లు ఒకే నగరంలో కీలక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రత్యేక హోదా కోసం విశాఖలో జరగబోయే ఆందోళనకు మద్దతుగా విశాఖకు జనవరి 26న వెళ్లనుండగా.. అదే రోజు రిపబ్లిక్ డే వేడుకల కోసం పవర్ లో ఉన్న చంద్రబాబు అక్కడికే వెళ్లనున్నారు. దీంతో ఆ రోజు పరిస్థితులు ఎలా ఉంటాయన్న చర్చ రాష్ట్రమంతా తీవ్రంగా సాగుతోంది. సోషల్ మీడియాలోనూ ఇదే చర్చ.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం విశాఖలోని ఆర్కే బీచ్ లో ఆందోళనకు రంగం సిద్ధమవుతోంది. హోదా కోసం ఏపీ యువత ఏకమవుతోంది. పార్టీలకు అతీతంగా శాంతియుతంగా చేపట్టే ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత హాజరుకావాలంటూ… గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఈ నిరసనకు జనసేనాని పవన్ కల్యాణ్ మద్దతు పలకడంతో, పోలీసులు కలవరపాటుకు గురవుతున్నారు.  జనవరి 26న నిర్వహించే ఈ కార్యక్రమానికి  పవన్ హాజరవుతున్నారు.

మరోవైపు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అదే రోజు విశాఖలో ఉండనున్నారు. మరుసటి రోజు నుంచే ప్రతిష్టాత్మక సీఐఐ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో, ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం పోలీసులకు కత్తి మీద సామే. అయితే, నిరసన కార్యక్రమం అనుమతి కోసం ఇంతవరకు తమను ఎవరూ సంప్రదించలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ఓవైపు నిరసన కార్యక్రమం జరుగుతుంటే… అక్కడే  ఉన్న ముఖ్యమంత్రికి ఇది ఇబ్బందికర అంశమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

చంద్రబాబుకు ఇది ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఉంది. అణిచివేస్తే రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసినట్లవుతుంది.. చూసీచూడనట్లు వదిలేస్తే పవన్ అండతో పబ్లిక్ ఇరగదీసే ప్రమాదమూ ఉంది. సో…లెటజ్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఆన్ 26 జనవరి.