వేడెక్కిన పవన్‌ రాజకీయం

నిన్న మొన్నటి వరకు వారానికి లేదా పది రోజులకోసారి ట్వీట్లు పెడుతూ, అడపాదడపా తన రాజకీయ ఉనికిని చాటుకున్న పవన్‌కళ్యాణ్‌ ఇప్పుడు ఫుల్‌ యాక్టివ్‌ అయిపోయాడు. ట్విట్టర్‌లో తరచుగా కనిపిస్తున్నాడు. ప్రభుత్వ పద్ధతిని ఎండగడుతున్నాడు. ఘాటైన విమర్శలతో తనదైన మార్కు రాజకీయం చేస్తున్నాడు.

జల్లికట్టు ఉద్యమం నుంచి స్ఫూర్తి పొందిన తెలుగు యువతని చూసి పవన్‌ ఉత్సాహపడుతున్నాడు. వారిని కదం తొక్కించే విధంగా పవర్‌ఫుల్‌ మాటలతో చైతన్యం రగిలిస్తున్నాడు. ఇంతకాలం ఒంటరి గొంతుగా మారిన పవన్‌కళ్యాణ్‌కి ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో యువతలో పుట్టుకొచ్చిన ఉద్యమస్ఫూర్తి కొత్త ఉత్సాహాన్నిస్తున్నట్టుంది. ఈ సందర్భంగా తాను రికార్డ్‌ చేయించిన ఆడియో ఆల్బమ్‌ని కూడా విడుదల చేస్తున్న పవన్‌కళ్యాణ్‌ 26న విశాఖ బీచ్‌లో యువతతో పాటు కలిసి వెళ్లాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం.

పవన్‌ వెళ్లినట్టయితే ప్రశాంతంగా జరిగే ఉద్యమంలో అలజడి రావచ్చు. అతడిని చూసేందుకు యువత ఎగబడితే తలపెట్టిన ఉద్దేశమే మారిపోవచ్చు. అందుకే ఇంకా అటెండ్‌ అవ్వాలా, వద్దా అనే దానిపై పవన్‌ సందిగ్ధంలో ఉన్నాడు. సెక్యూరిటీ సమస్యలుంటాయి కనుక పవన్‌ రాకకి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అభ్యంతరం తెలపవచ్చు. అయితే ఈ ఉద్యమ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించేలా చూడ్డానికి పవన్‌ త్వరలోనే ఒక బహిరంగ సభ ఏర్పాటుకు ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం.