పవన్ టు బన్నీ.. అడ్వాన్స్ మీదే ఫోకస్

కొబ్బరికాయ కొట్టిన రోజే థియేటర్లో బొమ్మ పడే రోజేమిటో చెప్పే ముచ్చట కొత్తదేం కాదు. ఈ కాన్సెప్ట్ ను మనోళ్లు ఇప్పుడిప్పుడే ఫాలో అవుతున్నారు. హాలీవుడ్.. బాలీవుడ్ లలో ఎన్నో ఏళ్లుగా ఫాలో అయ్యే ఫార్ములాను ఇప్పుడు మనోళ్లు బుద్ధిగా ఫాలో అయిపోతున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. రెబెల్ స్టార్ ప్రభాస్.. స్టైలీష్ స్టార్ బన్నీ.. ప్రిన్స్ మహేశ్.. ఇలా చెప్పుకుంటూ పోతే అగ్రహీరోలంతా తమ రిలీజ్ డేట్ ను చాలా ముందే చెప్పేస్తున్నారు.

బడ్జెట్లు పెరిగిపోవటం.. పెద్ద సినిమాకు మా గొప్ప ఇబ్బందిగా మారుతోంది. ఒకేసారి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే.. థియేటర్ల సమస్య ఒక్కటే కాదు.. పెరిగిన ఖర్చుల కారణంగా.. ఏ మాత్రం బాగోలేదన్న కామెంట్ బయటకు వచ్చినా.. ప్రేక్షకులు నిర్దాక్షిణ్యంగా సినిమాను చూడని పరిస్థితి. గతంలో మాదిరి ఏడాది.. ఆర్నెళ్లు.. వంద రోజులు.. కనీసం యాభై రోజుల కూడా ఆడే రోజులు పోయింది. సినిమా ఏదైనా.. మ్యాగ్జిమం అంటే రెండు వారాలు..థియేటర్లు తక్కువగా రిలీజ్ చేసి ఉంటే మరో వారమే తప్పించి.. నాలుగో వారం కూడా భారీగా థియేటర్లలో ఆడే సినిమాలు దాదాపుగా లేవనే చెప్పాలి.

వీలైనన్ని ఎక్కువ స్క్రీన్లలో సినిమా వేసేయటం.. మొదటి వీకెండ్ నాటికే పెట్టిన పెట్టుబడుల్ని సగానికి పైగా లాగించేయటం.. వారం గడిచే సరికి.. పెట్టుబడులు తెచ్చేసుకొని.. లాభాల మీద ఫోకస్ పెట్టే పరిస్థితి. ఈ విషయంలో ప్రతిది లెక్కగా మారుతోంది. ఇక్కడో మంచి ఉదాహరణ చెప్పాలి. మొన్న సంక్రాంతి పండగ సందర్భంగా రిలీజ్ అయిన ఖైదీ.. శాతకర్ణి సినిమాల రిలీజ్ డేట్లను చాలా ఆలస్యంగా డిసైడ్ చేయటంతో.. ఓవర్సీస్ కలెక్షన్ల మీద ప్రభావం పడిందని చెబుతున్నారు.

ఈసారి సంక్రాంతి సినిమాలు ఓవర్సీస్ లో మ్యాగ్జిమ్ కలెక్షన్లు సాధించినట్లు చెబుతున్నప్పటికీ.. కనీసం మూడు నెలల ముందు కానీ.. పక్కాగా డేట్ ఫిక్స్ అయి ఉంటే.. చాలా దేశాల్లో మరిన్ని స్క్రీన్లలో సినిమా వేసే అవకాశం ఉండేదని.. అలాంటి చాన్స్ మిస్ కావటమే కాదు.. చివర్లో మిగిలిన థియేటర్లలోనే రిలీజ్ చేసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. ముందస్తుగా రిలీజ్ డేట్ మీద పక్కా సమాచారం ఉండి ఉంటే.. మరిన్ని థియేటర్లను బుక్ చేసే అవకాశం ఉండేదన్న మాటను చెప్పారు ఓవర్సీస్ బయ్యర్లు.

గతంతో పోలిస్తే.. ఓవర్సీస్ మార్కెట్ ఇప్పుడు పెద్దగా మారిన నేపథ్యంలో.. థియేటర్లు ముందుగా బ్లాక్ చేసుకోవాలంటే.. రిలీజ్ డేట్ల మీద పూర్తి స్థాయిలో క్లారిటీ ఉండాలి. లేకపోతే.. ఎంత పెద్ద హీరో అయినా థియేటర్లు లభించని పరిస్థితి. ఈ ఎకనామిక్స్ ను తెలుగు అగ్రహీరోలు బాగానే వంటపట్టించుకుంటున్నారు. అందుకే.. క్రమశిక్షణతో తమ సినిమా రిలీజ్ లను ముందుగానే చెప్పేస్తున్నారు.

తాజాగా చూస్తే.. కాటమరాయుడి సినిమా మార్చి 24న రానుంటే.. ఏప్రిల్ 28న బాహుబలి-2 రానుంది. ఇక.. ఏప్రిల్ 28న దువ్వాడ జగన్నాథమ్ వస్తుంటే.. మహుశ్ – మురుగుదాస్ ఫిలిం జూన్ 23న వస్తున్నట్లుగా కన్ఫర్మ్ చేసేశారు. ఈ డేట్స్ ను చూస్తే.. అగ్రహీరోల సినిమా ప్రతి ఒక్క దానికి మరో దానితో క్లాష్ లేకుండా.. మినిమం 20 డేస్  గ్యాప్ మొయింటైన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీని కారణంగా.. పెద్ద సినిమాలతో పాటు.. చిన్న సినిమాల విడుదలకు ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు. ఇప్పుడు అనుసరిస్తున్న పద్ధతి కంటే కూడా.. కొబ్బరికాయ కొట్టిన రోజు రిలీజ్ డేట్ ను కూడా రిలీజ్ చేసేస్తే.. మరింత బాగుంటుందని చెబుతున్నారు. మరి.. అంత అడ్వాన్స్ డేట్లను ఫిక్స్ చేసేందుకు మన ‘‘బాబులు’’ ఎంత వరకూ రెడీగా ఉన్నారన్నది డౌటే. కానీ.. అలాంటి కల్చర్ ఒక్కసారి మొదలైందా.. కలెక్షన్లలో మార్పు  పక్కా అంటున్నారు. మరీ.. అడ్వాన్స్ బుకింగ్ ల విషయంలో మన హీరోలు మరెంత ముందుంటారో చూడాలి.