వైసీపీ దెబ్బకు మంత్రి ఛాన్సు పాయే?

2014 ఎన్నికల్లో ఓడిపోయినా ఆ తరువాత జగన్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి చంద్రబాబును మెప్పించి ఎమ్మెల్సీ అయిన నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి మంత్రి కావాలని ఆశపడుతున్నారు. నిత్యం చంద్రబాబు వద్ద చేరి ఏదో రూపంలో మనసు విప్పుతుండడంతో ఆయన కూడా ఈ చెవిలోని జోరీగ బాధ వదలాలంటే మంత్రి పదవి ఇచ్చేయడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చారట. కానీ… మరో మూడు వారాల్లో మంత్రి వర్గాన్ని విస్తరిస్తామన్న సమయంలో సోమిరెడ్డి పదవిపై మరోసారి అనిశ్చితి ఏర్పడిపోయింది. నెల్లూరు వైసీపీ నేతలు టీడీపీ నుంచి స్థానిక సంస్థల ప్రతినిధులను తమ పార్టీలోకి లాక్కోవడం… దాంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి గెలుపుపై ప్రస్తుతం డౌట్లు వస్తుండడంతో సోమిరెడ్డికి భయం పట్టుకుందట. పొరపాటున ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలవకపోతే దీన్ని సాకుగా చూపించి చంద్రబాబు తనకు మంత్రి పదవి ఎగ్గొట్టేస్తారని ఆయన భయపడుతున్నారట.

కాగా.. నెల్లూరు ఎమ్మెల్సీ టీడీపీకి వచ్చినా రాకపోయినా కూడా ఇంతటి కీలక సమయంలో పార్టీ ఓట్లను కాపాడుకోలేకపోవడం సోమిరెడ్డి చేతకానితనమేనని చంద్రబాబు భావిస్తున్నారట. ఇప్పటికే ఆయన సోమిరెడ్డి మంత్రి పదవిపై పునరాలోచను వచ్చారని తెలుస్తోంది.

వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాజకీయ ఎత్తుగడలతో టీడీపీకి చెందిన ఎంపీపీ, పలువురు ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీలు వైసీపీలోకి వచ్చేశారు. స్థానికసంస్థల ఎన్నికలకు ముందు ఇది టీడీపీని ఇది ఇబ్బంది పెడుతోంది. ఇక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాకాటి నారాయణరెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా వైసీసీ నుంచి ఆనం కుటుంబానికే చెందిన విజయ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు.  ఇక్కడ ఫలితం ఏమాత్రం తేడా కొట్టి వైసీపీ నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిస్తే సోమిరెడ్డి మంత్రి ఛాన్సు మిస్సవడం ఖాయం. అంతేకాదు… ఆనం విజయకుమార్ రెడ్డి ప్రాబల్యం పెరిగి అక్కడ వైసీపీ బలపడకుండా బ్యాలన్స్ చేసే ఎత్తుగడతో ఆనం రామనారాయణరెడ్డికి మంత్రి పదవి కూడా దక్కుతుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి.  మొత్తానికి వైసీపీ నేతల రాజకీయ ఎత్తుగడకు సోమిరెడ్డి మంత్రి ఛాన్సు పాయే అంటున్నారు నెల్లూరు టీడీపీ నేతలు. అన్నట్లు మరో మాట.. తాజా పరిణామాలతో ఆనం బ్రదర్స్ కూడా పైకి చెప్పకపోయినా లోలోన సంతోషంగా ఉన్నారట.