ఎన్టీఆర్ పాటను పవన్ వాడుకుంటాడా?

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి సినిమా ‘జల్సా’ అనే యూత్ ఫుల్, మాస్ టైటిల్ పెట్టుకున్నారు. ఐతే వీళ్లిద్దరూ కలిసి రెండో సినిమా చేసే సమయానికి ట్రెండ్ మారింది. అప్పటికి ప్రేక్షకులు మాస్ మసాలా సినిమాలు, టైటిళ్ల కోసం పట్టుబట్టే పరిస్థితి లేదు. ప్రేక్షకుల అభిరుచి అప్పుడే మారుతూ వస్తోంది. ఆ సమయంలో త్రివిక్రమ్ ‘అత్తారింటికి దారేది’ లాంటి సాఫ్ట్ టైటిల్ పెట్టి అందరికీ షాకిచ్చాడు. ఈ టైటిల్ విషయంలో మొదట వ్యతిరేకత వ్యక్తమైనా.. తర్వాత అలవాటు పడిపోయారు. సినిమా చూశాక ఇది యాప్ట్ టైటిల్‌ లాగా కూడా అనిపించింది. ఇప్పుడిక పవన్-త్రివిక్రమ్ కాంబోలో రాబోయే కొత్త సినిమాకు ఏ టైటిల్ పెడతారా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా మొదలై ఆరు నెలలవుతున్నా ఇప్పటిదాకా టైటిల్ ప్రకటించలేదు. ఈ లోపు చాలా టైటిళ్లు ప్రచారంలోకి వచ్చేశాయి. ‘ఇంజినీర్ బాబు’ అని.. ‘పరదేశ ప్రయాణం’ అని.. ‘గోకుల కృష్ణుడు’ అని.. ఇలా రకరకాల టైటిళ్లు వినిపించాయి. ఐతే ఇప్పుడు కొత్తగా మరో టైటిల్ తెరమీదికి వచ్చింది. రాజు వచ్చినాడు.. అనేది ఈ కొత్త టైటిల్. ఐతే ఈ పేరు బయటికి రాగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ అలెర్టయిపోయారు. పోయి పోయి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలోని పాట పల్లవి నుంచి టైటిల్ తీసుకుంటారా అని వాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

‘దమ్ము’ సినిమాలో రాజు వచ్చినాడో.. అంటూ ఎన్టీఆర్ మీద ఒక పాట ఉంటుంది. ‘రాజు వచ్చినాడు’ అనే టైటిల్ బాగున్నా సరే.. ఈ పదాలతో ఎన్టీఆర్ సినిమాలో పాట వచ్చింది కాబట్టి ఆ టైటిల్ వద్దు మొర్రో అంటూ సోషల్ మీడియాలో ఆల్రెడీ క్యాంపైన్ మొదలైపోయింది. మరి సెస్టెంబరు 2న పవన్ పుట్టిన రోజు కానుకగా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేయబోతున్న త్రివిక్రమ్ అండ్ కో ఏ టైటిల్‌కు ఏ టైటిల్‌కు ఫిక్సవుతుందో చూడాలి.