డిజెతో దశ తిరిగిపోతుందట

పూజ హెగ్డే అందానికి ముగ్ధులై ఆమె ఆరాధకులుగా మారిపోయిన కుర్రాళ్లు చాలా మందే వున్నారు కానీ ఇంతవరకు ఆమెకి తెరపై అదృష్టం కలిసి రాలేదు. మొదటి సినిమా ఒక లైలా కోసం అంతంత మాత్రంగా ఆడింది. రెండో సినిమా ముకుంద ఫ్లాప్‌ అయింది. బాలీవుడ్‌ డెబ్యూ మొహంజుదారో డిజాస్టర్‌గా మిగిలింది. ఇంతవరకు సక్సెస్‌ రుచి చూడని పూజ ప్రస్తుతం ‘దువ్వాడ జగన్నాథమ్‌’లో నటిస్తోంది.

ఇంతవరకు తన గ్లామర్‌కి న్యాయం చేసే పాత్ర ఒక్కటీ చేయని పూజ ‘డిజె’లో మాత్రం ఫుల్‌ హాట్‌గా కనిపించనుంది. సద్బ్రాహ్మణుడైన హీరో మనసు చలించేంత అందం ఆమెది. హరీష్‌ శంకర్‌ ఇందులో పూజ అందాన్ని ద్విగుణీకృతం చేసేట్టుగా చూపించాడట. ఈ చిత్రం రిజల్ట్‌తో సంబంధం లేకుండా డిజె తర్వాత పూజ టాలీవుడ్‌లో యమ బిజీ అయిపోతుందని, ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్ల కొరతతో ఇబ్బందిపడుతోన్న చిత్ర సీమకి మరో అయిదారేళ్ల పాటు నిలిచిపోయే హీరోయిన్‌ దొరికేసిందని చెప్పుకుంటున్నారు.

డిజె కనుక బ్లాక్‌బస్టర్‌ అయిందంటే ఇక వరుసపెట్టి స్టార్‌ హీరోల సినిమాలన్నీ పూజ వైపే చూస్తాయేమో. రకుల్‌ ప్రీత్‌లు, శృతిహాసన్‌లు కలవర పడాల్సిన కాంపిటీషన్‌ సిద్ధమైపోతోందన్నమాట.