ప్రభాస్ అన్ని కష్టాలు పడ్డాడా?

బాహుబలి కోసం ఏకంగా నాలుగేళ్లకు పైగా సమయం వెచ్చించాడు ప్రభాస్. ‘బాహుబలి’ వద్దనుకుంటే ఈ సమయంలో కనీసం అరడజను సినిమాలైనా చేసి ఉండొచ్చు. బోలెండంత డబ్బులు కూడా సంపాదించి ఉండొచ్చు. కానీ ప్రభాస్ అలా ఆలోచించలేదు. ‘బాహుబలి’కే అంకితమైపోయాడు. డబ్బుల సంగతేమో కానీ.. ఈ సినిమాతో ప్రభాస్‌కు వచ్చిన పేరు అలాంటిలాంటిది కాదు.

ఇండియాలో అమీర్ ఖాన్, విక్రమ్ లాంటి కొంతమంది తప్ప ప్రభాస్ చూపిన కమిట్మెంట్ అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఈ సంగతలా ఉంచితే.. ‘బాహుబలి’ చేస్తున్న సమయంలో ప్రభాస్ ఆర్థికంగా ఇబ్బందులు పడ్డట్లు రాజమౌళి చెబుతుండటం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది.

”బాహుబలి మొదలవడానికి ముందు ప్రభాస్ వరుసగా మూడు హిట్లు కొట్టాడు. అలాంటపుడు నిర్మాతలు ప్రభాస్ వెనుక పడకుండా ఎలా ఉంటారు. ప్రభాస్ కోసం కొందరు నిర్మాతలు చెక్కులతో వచ్చారు. కానీ ప్రభాస్ బాహుబలికే కమిట్ అయ్యాడు. నిర్మాతలెవరైనా చెక్కులిచ్చినా తీసుకోవద్దని తన మేనేజర్‌కు కూడా స్పష్టంగా చెప్పాడు.

నిజానికి ‘బాహుబలి’ చేస్తున్న సమయంలో డబ్బు కోసం ప్రభాస్ చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటి సమయంలోనిర్మాతలు డబ్బుతో వస్తే ఎవరైనా టెంప్ట్ అవుతారు. ఐతే ప్రభాస్ నాకు ఫోన్ చేసిన ఏం చేయాలో చెప్పమన్నాడు. పనితో సంబంధం లేకుండా ఇస్తున్న డబ్బు ఇది అని అఫిడవిట్ రాయించమన్నాను.

కానీ అందుకు అతను తటపటాయించాడు. తర్వాత మళ్లీ వాళ్లు వచ్చి ఆ డబ్బు తిరిగి ఇవ్వమంటే ఏం చేయాలి అని తిరస్కరించాడు. అంతే కాదు పది కోట్ల విలువైన ఎండార్స్‌మెంట్ వచ్చినా తిరస్కరించాడు” అంటూ ప్రభాస్ బాహుబలి కోసం చూపించిన కమిట్మెంట్ గురించి వివరించాడు రాజమౌళి.