బాహును కాదని బాబును చూస్తారా?

‘బాహుబలి: ది కంక్లూజన్’ హవా ఇంకా తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దూసుకెళ్తోంది. వీకెండ్ తర్వాత కూడా హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఆడుతోంది. దీంతో వేరే భాషల వాళ్లు కూడా ఈ వారం కొత్త సినిమాల్ని రిలీజ్ చేయడానికి తటపటాయిస్తున్నారు. కానీ తెలుగులో మాత్రం ‘బాబు బాగా బిజీ’ అనే చిన్న సినిమా ఈ వీకెండ్లో ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది.

ముందు బాహుబలి-2 వచ్చిన వారానికే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తే.. ఇదేదో పబ్లిసిటీ కోసం చేస్తున్న ప్రయత్నమని.. తర్వాత రిలీజ్ డేట్ మారుస్తారని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. అన్నట్లుగానే సినిమాను శుక్రవారం రిలీజ్ చేసేస్తున్నారు.

మరి ‘బాహుబలి-2’ను కాదని జనాలు ‘బాబు బాగా బిజీ’ని చూస్తారా అన్న సందేహం కలుగుతోంది అందరిలో. కానీ ‘బాహుబలి-2’ను కాదని తమ సినిమా చూడరని.. ‘బాహుబలి-2’ను చూసేసిన వాల్లు.. ఆ సినిమాను చూడలేకపోయిన వాళ్లు ‘బాబు బాగా బిజీ’ వైపు చూస్తారని అంటోంది చిత్ర బృందం.

రెగులర్‌గా సినిమాలు చూసే జనాలు వారం తిరగ్గానే కొత్త సినిమా కోసం చూస్తారని.. ‘బాబు బాగా బిజీ’ కుర్రాళ్లను బాగా ఆకర్షించే అవకాశముంది కాబట్టి వాళ్లూ సినిమాకు వస్తారని.. వీళ్లందరూ కాక.. వీకెండ్లో ‘బాహుబలి-2’ చూద్దామని వచ్చి టికెట్లు దొరకని వాళ్లకు కూడా తమ సినిమానే ఛాయిస్ అవుతుందని.. కాబట్టి వసూళ్లకు ఢోకా ఏమీ ఉండదని భావిస్తున్నారు.

‘బాహుబలి-2’నా.. లేక ‘బాబు బాగా బిజీ’నా అనే ఛాయిస్ తీసుకునే అవకాశం లేదని.. వేరే రకంగానే తమ సినిమాకు ఆదరణ దక్కుతుందనే ఆశతో ఉంది చిత్ర బృందం. నైజాంలో పేరు మోసిన డిస్ట్రిబ్యూటర్ అయిన అభిషేక్ ఈ చిత్రానికి నిర్మాత కావడంతో దీనికి థియేటర్లు చెప్పుకోదగ్గ స్థాయిలోనే దక్కాయి.