ఇడియట్‌ పార్ట్‌ 2

పూరి జగన్నాథ్‌ కొత్త సినిమా ‘రోగ్‌’ పోస్టర్‌ని వాలెంటైన్స్‌ డే సందర్భంగా రివీల్‌ చేసాడు. తలకిందులుగా వేలాడుతోన్న ఇషాన్‌తో ఈ పోస్టర్‌ చూడగానే ఆకట్టుకునేలానే వుంది. ఈ చిత్రం తనకి చాలా స్పెషల్‌ అంటోన్న పూరి జగన్నాథ్‌ ‘మరో చంటిగాడి ప్రేమకథ’ అంటూ ట్యాగ్‌లైన్‌తో ‘ఇడియట్‌’ని గుర్తు చేసాడు.

ఇడియట్‌కి సీక్వెల్‌ చేస్తానని పలుమార్లు చెప్పిన పూరి జగన్నాథ్‌ ఫైనల్‌గా ఆ సినిమా ఇప్పుడు చేస్తున్నట్టున్నాడు. విశేషం ఏమిటంటే అప్పట్లో ఇడియట్‌ చిత్రాన్ని కన్నడలో ముందుగా తీసి తర్వాత తెలుగులో దానిని రీమేక్‌ చేసాడు.

పైగా ఇడియట్‌ కన్నడ వెర్షన్‌ అయిన ‘అప్పు’తో పునీత్‌ రాజ్‌కుమార్‌ని పూరి జగన్నాథ్‌ హీరోగా పరిచయం చేసాడు. ఇప్పుడు రోగ్‌తో నిర్మాత సి.ఆర్‌. మనోహర్‌ తనయుడు ఇషాన్‌ని పూరి హీరోగా ఇంట్రడ్యూస్‌ చేస్తున్నాడు.

ఇన్ని కోఇన్సిడెన్స్‌లు వున్నందువల్ల ఈ చిత్రాన్ని స్పెషల్‌ అని అంటున్నాడో లేక పూరి జగన్నాథ్‌కి రోగ్‌ స్పెషల్‌ అవడానికి మరేదైనా కారణం వుందో తెలియదు కానీ, రోగ్‌ మాత్రం పూరి కెరియర్‌కి చాలా కీలకం. ఇజం తర్వాత పూరిపై తెలుగు సినిమా హీరోలంతా నమ్మకం కోల్పోయారు కనుక ఇప్పుడతను ఇడియట్‌ రేంజ్‌ హిట్‌ ఇస్తే కానీ మళ్లీ గాడిన పడే అవకాశాలు లేవు.