చరణ్‌ హ్యాండిచ్చాడు, అఖిల్‌ రమ్మన్నాడు!

సుకుమార్‌ సినిమాలో ముందుగా హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ని తీసుకుని తర్వాత ఎందుకు తప్పించారనేది ఇంతవరకు తెలీలేదు. పల్లెటూరి కథ కనుక అనుపమ అయితే బాగుంటుందని ఏరి కోరి ఆమెతో సంతకం చేయించుకుని, అడ్వాన్స్‌ కూడా ఇచ్చేసారు. కానీ తర్వాత ఆమె స్థానంలో సమంతని తీసుకుంటున్నట్టు చెప్పారు.

చరణ్‌ పక్కన అనుపమ చిన్న పిల్లలా వుందంటూ నమ్మశక్యం కాని లీక్‌ ఒకటి మీడియాకి వదిలారు. ఎలాగైతేనేం ఆ చిత్రాన్ని చేజార్చుకున్న అనుపమకి మరో భారీ చిత్రంలో అవకాశం వచ్చిందంటూ వార్తలొస్తున్నాయి. అఖిల్‌ హీరోగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఒక హీరోయిన్‌గా అనుపమ ఎంపికైందట.

ఆల్రెడీ నాగచైతన్యతో ప్రేమమ్‌ చేసిన అనుపమ ఇప్పుడు అతని తమ్ముడితోను రొమాన్స్‌ చేయనుందన్నమాట. విక్రమ్‌ కుమార్‌ సినిమాలంటేనే వైవిధ్యభరితంగా వుంటాయి కనుక అనుపమ చేతిలో మరో ప్రామిసింగ్‌ ప్రాజెక్ట్‌ వున్నట్టే.

ఈ చిత్రానికి ముందుగా అనుకున్న కథ ముందుకు సాగడం లేదని విక్రమ్‌ కుమార్‌ ఒక కొత్త కథ రాసాడని, ఇది కూడా మనం మాదిరిగా స్పెషల్‌ సినిమా అవుతుందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది.