పూరికి అంత ధైర్యం ఉందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘కాటమరాయుడు’ భారీ అంచనాల మధ్య ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. ముందు ఈ సినిమా వచ్చిన ఐదు రోజులకే శర్వానంద్ కొత్త సినిమా ‘రాధ’ను రిలీజ్ చేసేయాలని అనుకున్నాడు నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్. ఐతే ఏం జరిగిందో ఏమో.. ఆ తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నాడు. ‘కాటమరాయుడు’ మీద పాజిటివ్ బజ్ పెరుగుతున్న నేపథ్యంలోనే ఆయన వెనక్కి తగ్గినట్లుగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడిక పూరి జగన్నాథ్ వంతు వచ్చింది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘రోగ్’ మూవీని కన్నడ-తెలుగు భాషల్లో ఒకేసారి మార్చి 31న రిలీజ్ చేయాలని డిసైడయ్యారు.

కానీ ఇప్పుడు పూరి కూడా రిలీజ్ డేట్ విషయంలో కొంత అయోమయంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. 31నే సినిమా రిలీజయ్యేట్లయితే ఈపాటికి ప్రమోషన్ జోరు పెంచాల్సింది. రిలీజ్ డేట్ పోస్టర్లు వదలాల్సింది. ఐతే అసలే కొత్త హీరో. పైగా చాలా ఖర్చు పెట్టి సినిమా తీశారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. ఈ హీరోను తెలుగు ప్రేక్షకుల్లో రిజిస్టర్ అయ్యేలా చేయడం కీలకం. మరి పవన్ సినిమా హంగామా నడుస్తున్న టైంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తే.. ఆశించిన ప్రయోజనం నెరవేరేదేమో అని పూరి కంగారు యోచిస్తున్నట్లు సమాచారం.

24న ‘కాటమరాయుడు’ టాక్ ఏంటో చూసుకుని.. ఆ తర్వాత రిలీజ్ డేట్ ఫిక్స్ చేద్దామని.. టాక్ బావుంటే సినిమాను వాయిదా వేసి.. లేదంటే యధావిధిగా 31న సినిమాను రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారట. ఐతే 31న కాదనుకుంటే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి చాలా కాలం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఏప్రిల్ తొలి రెండు వారాల్లో.. ఒక్కో వీకెండ్‌కు రెండేసి సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. ఇక చివరి వారంలో ‘బాహుబలి: ది కంక్లూజన్’ వస్తోంది కాబట్టి ముందు వెనుక వారాల్లో వేరే సినిమాలేవీ రిలీజ్ చేసే పరిస్థితి లేదు. మరి ఈ పరిస్థితుల్లో ‘రోగ్’పై పూరి ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.