చిరంజీవిని బ్లేమ్ చేయడం సబబేనా?

సంక్రాంతికి నాలుగు సినిమాలు వచ్చాయి కానీ మూడింటి గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ గుర్తింపుకి నోచుకోని నాలుగో సినిమానే ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’. ఆర్. నారాయణమూర్తి హీరోగా చదలవాడ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సరిగ్గా సంక్రాంతి రోజున రిలీజయింది.

విడుదలకి ముందు నుంచీ తమకి థియేటర్లు దొరకడం లేదంటూ దర్శక-నిర్మాత, హీరో వాపోతూనే వున్నారు. రిలీజ్ అయిన తర్వాత కూడా థియేటర్లివ్వలేదంటూ ఆక్రోశం వెలిబుచ్చారు. నైజాంలో ఇరవై మూడు థియేటర్లు దొరికాయని, ఏపీలో మాత్రం ఒక్క థియేటర్ కూడా దొరకలేదని వారు చెప్పుకున్నారు.

పైగా ఏపీలో థియేటర్లు దొరక్కపోవడానికి కారణం చిరంజీవి అంటూ ఆయనపై డైరెక్ట్ ఎటాక్ చేసారు. నిజానికి ఏపీలో అసలు సింగిల్ థియేటర్ దొరకలేదనేది అవాస్తవం. అక్కడ కూడా ఈ చిత్రం రిలీజ్ అయింది కానీ మిగిలిన మూడు సినిమాల ధాటికి కనీసం థియేటర్ రెంట్లు కూడా తెచ్చుకోలేక అన్ని చోట్ల డెఫిసిట్ల మీద రన్ అవుతోంది. పండక్కి సినిమా విడుదల చేస్తే కలెక్షన్లు బాగుంటాయనే ఆశతో రిలీజ్ చేయడం తప్పు కాదు కానీ, అన్ని సినిమాల మధ్య విడుదల చేయడం సబబా, కాదా అనేది ఆలోచించుకుని ఉండాల్సింది.

నారాయణమూర్తి సినిమాలని ఒకప్పుడు జనం ఎగబడి చూసేవారు కానీ ఈమధ్య కాలంలో ఆయన సినిమాలేవీ ఆడడం లేదు. పండగలకి పెద్ద సినిమాలు విడుదల చేయడానికి కారణం పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకునే అవకాశం మెరుగు పడుతుందని. చిన్న సినిమాలకా చింత లేదు. మామూలు రోజుల్లో రిలీజ్ అయి, బాగుందనిపించుకున్నా మంచి వసూళ్లు వస్తాయని చాలా చిత్రాలు నిరూపించాయి. రాంగ్ టైమింగ్తో వచ్చి, చేజేతులా పరాజయం కొని తెచ్చుకున్నది కాక, ఉరుము ఉరుమి మంగళం మీద పడ్డట్టు చిరంజీవిపై విరుచుకుపడడం సమంజసమేనా?

ఫలానా సినిమాకి థియేటర్ ఇవ్వవద్దంటూ చిరంజీవేమీ అడ్డు పడలేదు కదా? పోనీ విడుదలైన థియేటర్ల నుంచి షేర్లేమైనా వస్తున్నాయా అంటే అదీ లేదే? మరెందుకీ బ్లేమ్ గేమ్? సింపతీ కార్డ్ ప్లే చేస్తే వార్తల్లో వుండవచ్చుననా? అంటూ మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. వారి ఆవేదనలో అర్థమున్నట్టే, వీరి వాదనలోను లాజిక్ ఉంది కదూ?