నేటితరం నటులు సినిమా సెట్లో సరిగా ఉండడం లేదని చిరంజీవి విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. షాట్ గ్యాప్ దొరకగానే క్యారవాన్ లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంటున్నారని, షాట్ రెడీ అయినప్పుడు వారిని పిలవడానికి కొందరు అసిస్టెంట్ డైరెక్టర్లు పని చేస్తున్నారని, ఇది సదరు వ్యక్తులకి అగౌరవమే కాకుండా నిర్మాతకి కూడా చాల అసౌకర్యమని చిరంజీవి అన్నారు.
చిరంజీవి మాటలతో రాజమౌళి ఏకీభవించలేదు కానీ, ఆర్.ఆర్.ఆర్. లో ఒక కీలక పాత్ర చేస్తున్న బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ గురించి రాజమౌళి ఇంచుమించు ఇదే చెప్పాడు. అతనెప్పుడూ క్యారవాన్ లో కూర్చోడని, భోజనం కూడా బయట చెట్టు కింద కూర్చుని చేస్తాడని, తన షాట్ వచ్చే వరకు అటు ఇటు వెళ్లడం చేయకుండా అక్కడే కూర్చుని ఎదురు చూస్తాడని, అలాంటి సింప్లిసిటీ ఉన్న నటులు చాలా అరుదు అని రాజమౌళి ఎంతో గొప్పగా అజయ్ దేవగణ్ గురించి చెప్పాడు. బహుశా ఈ తరం నటులు వీరినుంచి నేర్చుకోవాల్సింది చాలానే ఉన్నట్టుంది.