బాహుబలితో చిరంజీవికి లింక్‌ లేదు

‘బాహుబలి – ది కంక్లూజన్‌’ చిత్రానికి మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నారనే రూమర్స్‌ ఊపందుకున్న నేపథ్యంలో అదేమీ నిజం కాదని చెబుతూ రాజమౌళి ఈ వదంతులకి ఆదిలోనే ఫుల్‌స్టాప్‌ పెట్టేసాడు. ఈమధ్య ఘాజీ, గుంటూరోడు చిత్రాలకి చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడంతో ‘బాహుబలి 2’ న్యూస్‌ కూడా నిజమే అనుకున్నారు.

కానీ అలాంటిదేం లేదని రాజమౌళి తేల్చేసాడు కనుక దీనికి మెగా అదనపు ఆకర్షణలేం వుండవని ఫిక్స్‌ అయిపోవచ్చు. ఇదిలావుంటే బాహుబలి చిత్రం గురించి రోజుకో కొత్త పుకారు పుట్టుకొస్తోంది. అవి నిజం కాదంటూ ఎప్పటికప్పుడు ఖండనలతో బాహుబలి బృందం బిజీగా వుంటోంది. షారుక్‌ ఖాన్‌ వున్నాడని, రజనీకాంత్‌ ఒక మెరుపు పాత్ర చేసాడని ఇలా తరచుగా ఏదో ఒక వార్త బాహుబలి గురించి వెలుగులోకి వస్తోంది.

ఇప్పటికే భారీ అంచనాలున్న ఈ చిత్రానికి కొత్తగా ఈ వార్తలతో హైప్‌ తీసుకురావడం ఇష్టం లేక, ఆల్రెడీ తారాస్థాయిలో వున్న అంచనాలు మరింత పెంచుకుని ఒత్తిడిలో పడడం నచ్చక రాజమౌళితో పాటు బాహుబలి నిర్మాతలు పుకార్లని మొగ్గలోనే తుంచేస్తున్నారు. ఇంకా కామెడీ ఏమిటంటే ఇంకా ఫస్ట్‌ కాపీ కూడా చూడని ఈ చిత్రాన్ని చూసామంటూ, అద్భుతమంటూ కొందరు కాకమ్మ కథలు చెప్తూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత భారీ హైప్‌ వున్న సినిమా కనుక ఏదో ఒకలా క్యాష్‌ చేసుకోవాలని అంతా చూస్తుంటారు కనుక బాహుబలి బృందానికి ఇది ఎక్స్‌ట్రా హెడ్డేకే.