ఆ సంఘటన మరిచిపోలేనంటున్న జక్కన్న

ఒక దర్శకుడు నాలుగేళ్లుగా ఒకే సినిమాకు అంకితం కావడం అన్నది అరుదుగా జరిగే విషయం. దర్శక ధీరుడు రాజమౌళి ‘బాహుబలి’కి అలాగే అంకితమైపోయి ఉన్నాడు. ఈ నాలుగేళ్లలో అతడికి ఈ చిత్రం ఎన్నెన్ని అనుభవాలు మిగిల్చి ఉంటుందో కదూ.

మరి వాటన్నింట్లోకి ఒక మరపురాని అనుభవం గురించి చెప్పమని అడిగితే.. అలా చెప్పడం చాలా కష్టమన్నాడు రాజమౌళి. ‘బాహుబలి’ షూటింగ్ సందర్భంగా వందల్లో తనకు ప్రత్యేక అనుభవాలున్నాయని.. ప్రతి రోజూ ఏదో ఒక ఇన్సిడెంట్ తనకు గుర్తుండిపోయేదనని.. ఐతే అన్నింట్లో మహాబలేశ్వరంలో షూటింగ్ జరుగుతుండగా జరిగిన సంఘటనను ఎప్పటికీ మరిచిపోలేనని చెబుతూ.. దాని గురించి వివరించాడు జక్కన్న.

‘‘మహాబలేశ్వరంలో ఒక చెరువు దగ్గర షూటింగ్ చేశాం. అక్కడ గట్టు ఏటవాలుగా ఉంటుంది. మాకు షూటింగుకి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఒక జీమ్మీ జిప్ వ్యాన్లో తీసుకొచ్చాం. దాన్ని ఒక చోట పార్క్ చేసి ఎవరి పనిలో వాళ్లున్నారు. అందరూ బిజీగా ఉన్న టైంలో ఆ వ్యాన్ కదిలింది. నేరుగా చెరువు వైపు వెళ్తూ కనిపించింది. డ్రైవర్ ఏంటి దాన్ని చెరువు వైపు నడిపిస్తున్నాడు అనుకున్నాం. కానీ అందులో డ్రైవర్ లేడని.. ఏటవాలుగా ఉండటంతో దానంతట అదే కదులుతూ చెరువులోకి వెళ్లిపోతోందని అర్థమైంది. అందరం హడావుడి పడ్డాం. మేం దాన్ని చేరుకునే లోపే చెరువులోకి వెళ్లిపోయింది. చెరువు మధ్యలోకి చేరుకుంది. కాకపోతే పూర్తిగా మునగకుండా పైభాగం తేలుతూ కనిపించింది. మా యూనిట్లో కొందరు గజ ఈతగాళ్లను పంపించి.. దానికి తాళ్లు కట్టించి.. ‘బాహుబలి’లో భల్లాలదేవుడి విగ్రహాన్ని లాగినట్లు అందరం బయటికి లాగాం’’ అని రాజమౌళి వెల్లడించాడు.