చరణ్‌కా, సుకుమార్‌కా.. ఎవరికి ప్లస్‌ ఇది?

రామ్‌ చరణ్‌తో సుకుమార్‌ సినిమా ఎలా ఉంటుందనే దానిపై క్లారిటీ ఇచ్చేస్తూ థీమ్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేసేసారు. లుంగీ ఎగ్గట్టి, కావిడిపై బిందెలు మోసుకెళ్తున్న చరణ్‌ని చూస్తే అతని క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుందనేది తెలిసిపోతుంది. చరణ్‌ని ఇంతవరకు ఎవరూ చూపించని తరహాలో చూపించడానికి సుకుమార్‌ ఈ కథ రాసుకున్నాడు. ఇప్పటివరకు చరణ్‌ చేసిన క్యారెక్టర్స్‌ అన్నీ అర్బన్‌ బేస్డ్‌ స్టయిలిష్‌ పాత్రలే.

మొదటిసారిగా ఊర నాటు పాత్రలో చరణ్‌ని ఎలా రిసీవ్‌ చేసుకుంటారనేది ఆసక్తికరమే. ఈ చిత్రానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్‌ డైనమిక్‌ చర్చకి వస్తోంది. చరణ్‌కి మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ వుంది. అలాగే సుకుమార్‌ అంటేనే క్లాస్‌ చిత్రాలకి పెట్టింది పేరు. ఇంతవరకు సుకుమార్‌ తీసిన సినిమాలు బి, సి సెంటర్స్‌లో అంతగా ఆడలేదు. ఎన్టీఆర్‌తో చేసినా కానీ ‘నాన్నకు ప్రేమతో’లాంటి స్టయిలిష్‌ యాక్షన్‌ చిత్రాన్నే చేసాడు.

చరణ్‌తో మాత్రం విలేజ్‌ బేస్డ్‌ క్యారెక్టర్‌ ఎంచుకున్నాడు. కాకపోతే తొంభైల కాలం నాటి ప్రేమకథ, హీరోకి వినికిడి లోపం వుంటుందని వింటే సుకుమార్‌ స్టాంప్‌ కనిపిస్తోంది. ఫైనల్‌గా ఈ చిత్రం క్లాస్‌లోకి చొచ్చుకుపోవాలని చూస్తోన్న చరణ్‌కి ప్లస్‌ అవుతుందా లేక సుకుమార్‌ని మాస్‌లోకి తీసుకెళుతుందా? అంతిమంగా ఈ చిత్రం ఎవరికి ఎక్కువ ప్లస్‌ అవుతుందనేది ఆసక్తికరమైంది.