రాంగోపాల్‌వర్మ మగాడు

ఒక్కోసారి వితండవాదం చేస్తుంటాడు. ఒక్కోసారి తలతిక్కగా ప్రవర్తిస్తుంటాడు. అవసరం లేని వాటికి అవతలి వాళ్లని ఎద్దేవా చేస్తుంటాడు. దేవుళ్లనీ, నమ్మకాలని కించపరుస్తుంటాడు. కానీ కొన్నిసార్లు న్యాయం మాట్లాడతాడు. కోట్ల మందికి వ్యతిరేకంగా నిలబడతాడు. జనాలకి భయపడి వాళ్ల సెంటిమెంట్స్కి అనుగుణంగా మాట్లాడే సెలబ్రిటీల మధ్య ఉన్నది ఉన్నట్టు మాట్లాడ్డానికి జంకనే జంకడు. అందుకే రాంగోపాల్వర్మని ఇగ్నోర్ చేయలేరెవరూ.

తమిళనాడు రాష్ట్రం మొత్తానికీ శత్రువు అయిపోతాడని తెలిసినప్పటికీ ‘జల్లికట్టు’ సాంప్రదాయంలోని పశుగుణాన్ని నిర్భయంగా, నిర్భీతిగా ఎండగట్టాడు. తెల్లవారితే జంతు క్షేమం గురించి లెక్చర్లు దంచే సెలబ్రిటీలంతా ఎక్కడ జనం తిరగబడతారోనని భయపడి జల్లికట్టుకి జై కొడుతుంటే, రాంగోపాల్వర్మ మాత్రం మగాడిలా నిలబడ్డాడు. జల్లికట్టు అనే విష సంస్కృతిపై తన ఫీలింగ్స్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు.

ఈ సంప్రదాయానికీ, తాలిబన్ల గుణానికీ తేడా లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమిళ జనం తిట్టిపోస్తున్నా కానీ వర్మ ధైర్యానికి, గట్స్కి ఒక వర్గం అతడిని దేవుడిలా చూస్తోందిప్పుడు. మొన్నటి వరకు పిచ్చి పిచ్చి చేష్టలతో స్థాయి తగ్గించుకున్న వాడే ఇప్పుడు హీరో అయిపోయాడు.