చెప్పుతో కొట్టిన ఎంపీ ఐదుగురు డూప్‌లు పెట్టుకున్నాడు

శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ గుర్తున్నాడు క‌దా. ఆయ‌న మళ్లీ వార్తల్లో నిలిచారు. అచ్చం తనలాగే ఉన్న ఐదుగురు వ్యక్తులను మీడియా తన వెంటబడకుండా ఉపయోగించుకున్నానని స్వయంగా వెల్ల‌డించ‌డం ద్వారా గైక్వాడ్ కొత్త షాక్ ఇచ్చారు. వినడానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజం. మరాఠ్వాడాలోని లాతూర్‌లో ఓ పాన్‌షాప్ వద్ద ఆగి ఉన్న రవీంద్ర గైక్వాడ్‌ను ఇండియాటుడే బృందం కనిపెట్టడంతో ఈ విషయం బయటపడింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. డ్రైవర్ కూడా అచ్చుగుద్దినట్టు గైక్వాడ్‌లాగే ఉన్నారు.  దీంతో షాక్ తిన‌డం ఇండియాటుడే టీం వంతు అయింది.

అస‌లు గైక్వాడ్ ఏం చేస్తున్నారో తేల్చేందుకు ఇండియాటుడే బృందం ఆయన కారును ఫాలో అయింది. మార్గమధ్యంలో గైక్వాడ్‌ను పోలిన మరో వ్యక్తి కనిపించారు! ఆ వ్యక్తి పేరు ప్రదీప్ మడ్నే. వీరి గురించి గైక్వాడ్ వద్ద ప్రస్తావించగా ఊహించ‌ని విష‌యం చెప్పారు. ఎయిర్ ఇండియా ఉద్యోగిని కొట్టిన ఘటన తర్వాత మీడియా తన వెంట పడుతుండేదని, ఈ బాధ నుంచి తప్పించుకునేందుకు వారిని ఉపయోగించుకున్నానని తెలిపారు. దీంతో అవాక్క‌వ‌డం ఇండియా టుడే జ‌ర్న‌లిస్టుల వంతు అయింది.

ఇదిలా ఉండ‌గా… అనుచితంగా వ్యవహరించే ప్రయాణికులకు భారీగా జరిమానా వడ్డించడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎయిర్ ఇండియా సంస్థ నిర్ణయించింది. గంట ఆలస్యం చేస్తే రూ.5 లక్షలు, ఒకటి నుంచి రెండు గంటలు ఆలస్యం చేస్తే రూ.10 లక్షలు, రెండు గంటలకు మించి ఆలస్యం చేసే వారికి రూ.15 లక్షలు జరిమానా వేసేందుకు ఎయిర్ ఇండియా సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నిబంధ‌న‌లు అమ‌ల్లోకి వ‌స్తే….సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, విమానాల ఆలస్యానికి కారణమయ్యే ప్రయాణికులు ఇకపై లక్షల్లో జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్న మాట‌.