అల్లుడు గారి సత్తా ఏంటో ఇప్పుడు తెలుస్తుంది

సినిమా మీద ఉన్న పాజిటివ్ బజ్ వల్ల కావచ్చు.. ఎక్కువ థియేటర్లలో రిలీజ్ కావడం వల్ల కావచ్చు.. పెద్దగా పోటీ లేకపోవడం వల్ల కావచ్చు.. మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సినిమా ‘విన్నర్’కు అంచనాల్ని మించి ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజు ఈ సినిమాకు వరల్డ్ వైడ్ రూ.6.5 కోట్ల షేర్ రావడం అన్నది అనూహ్యమైన విషయం. మీడియం రేంజి సినిమాల్లో ఇది ఒక రికార్డు. శని.. ఆదివారాల్లో వసూళ్లు కొంచెం తగ్గినప్పటికీ పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. ఫస్ట్ వీకెండ్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ.11 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఇవి సాయిధరమ్ కెరీర్లో హైయెస్ట్ వీకెండ్ కలెక్షన్స్. ఐతే వీకెండ్ వసూళ్లను బట్టి సినిమా అంతిమ ఫలితంపై ఒక అంచనాకు వచ్చేయలేం.

‘విన్నర్’ అసలు సత్తా ఏంటన్నది సోమవారం తెలుస్తుంది. ఈ సినిమాకు టాక్ ఏమంత బాగా లేదు. రివ్యూలన్నీ నెగెటివ్‌గానే వచ్చాయి. పబ్లిక్ టాక్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఐతే సినిమా మీద ఉన్న హైప్ వల్ల.. మాస్ ప్రేక్షకులు కొంత వరకు ఎంటర్టైన్ కావడం వల్ల ఓపెనింగ్స్ వచ్చాయి. సోమవారం నుంచి మాత్రం సినిమా నిలబడటం కష్టమే అన్నది విశ్లేషకుల మాట. ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ ఈ సినిమా ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.

ఈ చిత్రానికి రూ.25 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. రూ.30 కోట్ల దాకా షేర్ రాబడితే తప్ప బయ్యర్లకు లాభాలు అందవు. ఐతే వీకెండ్లో వచ్చింది రూ.11 కోట్లే కాబట్టి.. ఇలాగే స్టడీగా మూడో వీకెండ్ వరకు వసూళ్లు రాబడితే తప్ప ‘విన్నర్’ హిట్ అనిపించుకోదు. ఐతే ఈ శుక్రవారం ఏకంగా మూడు సినిమాలు థియేటర్లలోకి దిగుతున్నాయి. డివైడ్‌ టాక్‌తో మొదలైన సినిమా.. ఆ పోటీని తట్టుకుని రెండో వీకెండ్లోనూ మంచి వసూళ్లు రాబట్టడం అంత సులువు కాదు. అంతకంటే ముందు సోమవారం ‘విన్నర్’ ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి. అప్పుడే సినిమా భవితవ్యంపై ఒక అంచనాకు రావచ్చు.