పెట్టుబడిపై నాలుగు రెట్లు వసూళ్లు?

ఫిదా’ సినిమా అంచనాల్ని మించిపోయి పెర్ఫామ్ చేస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు రేపుతోంది. ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ చూస్తే.. ఇది ఫుల్ రన్లో రూ.25-30 కోట్ల మధ్య షేర్ రాబడుతుందని అంచనా వేశారు ట్రేడ్ పండిట్లు. కానీ ‘ఫిదా’ అంచనాల్ని మించిపోయింది. రెండు వారాల్లోనే రూ.32 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది. ‘ఫిదా’ వచ్చిన తర్వాతి వారం విడుదలైన ‘గౌతమ్ నంద’ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం దీనికి బాగా కలిసొచ్చింది.

ఆ సినిమా ఫస్ట్ వీకెండ్లో సాధించిన వసూళ్ల  కంటే ‘ఫిదా’ రెండో వారంలో ఎక్కువ కలెక్షన్లు తెచ్చుకోవడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో మాస్ ఏరియాల్లో కలెక్షన్లు ఓ మోస్తరుగా ఉండగా.. సిటీల్లో మాత్రం సినిమా చితగ్గొట్టేసింది. ఇక అమెరికాలో అయితే చెప్పాల్సిన పని లేదు.

వీకెండ్లలో దుమ్ము దులుపుతూ.. వీక్ డేస్‌లోనూ స్టడీగా కలెక్షన్లు రాబడుతూ ఇప్పటికే 1.8 మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసిందీ సినిమా. ఫుల్ రన్లో అక్కడ 2 మిలియన్ క్లబ్ కూడా సాధ్యమే అని తేలిపోయింది. ఇక ఓవరాల్‌గా కూడా ‘ఫిదా’ రూ.40 కోట్ల షేర్ మార్కును అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ వారంలో వస్తున్న ‘నక్షత్రం’.. ‘దర్శకుడు’ మీద పెద్ద అంచనాలేమీ లేవు. అవి అనూహ్యమైన ఫలితాల్ని రాబడితే తప్ప.. ఈ వీకెండ్లో కూడా ‘ఫిదా’ మంచి వసూళ్లే రాబట్టే అవకాశముంది. ఈ సినిమా బడ్జెట్ రూ.10 కోట్లే అంటున్నారు. అంటే పెట్టుబడి మీద నాలుగు రెట్లు షేర్ రాబట్టి బిగ్ బ్లాక్ బస్టర్ అనిపించుకోబోతోందన్నమాట ‘ఫిదా’