రానాకు ఏడుపు తన్నుకొచ్చేసింది

రామానాయుడి కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన మూడో తరం వ్యక్తి రానా. తాత పేరు పెట్టుకుని.. ఆయన బాటలోనే ముందు ప్రొడక్షన్లో అడుగుపెట్టాడు రానా. కానీ తర్వాత గమనం మారింది. నటుడిగా మారాడు. ఐతే రామానాయుడు జీవించి ఉన్న సమయంలో రానా కెరీర్ ఏమంత బాగా లేదు. తొలి సినిమా ‘లీడర్’ ఆశించిన ఫలితాన్నివ్వకపోగా.. ఆ తర్వాత నటించిన ‘నా ఇష్టం’.. ‘దమ్ మారో దమ్’.. ‘డిపార్ట్‌మెంట్’ లాంటి సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఐతే రానా కెరీర్‌ను మలుపు తిప్పిన ‘బాహుబలి’.. ‘ఘాజీ’ లాంటి సినిమాలు రిలీజయ్యే సమయానికి రామానాయుడు లేరు.

ముఖ్యంగా ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా రానా పేరు మార్మోగిపోయిన సమయంలో రామానాయుడు లేకపోవడం ఆయన కుటుంబ సభ్యులకు బాధ కలిగించే విషయమే. ఇదే విషయమై రానా చాలా ఎమోషనల్ అయ్యాడు. తన సక్సెస్‌లను తాత చూడలేకపోయాడంటూ ‘నేనే రాజు నేనే మంత్రి’కి సంబంధించిన ఈవెంట్లో రానా బాధపడ్డాడు. ఈ సినిమా చేస్తున్నంత కాలం తనకు తన తాత గుర్తుకొస్తూనే ఉన్నాడని.. ఆయన ఈ సినిమాలో తన నటన చూస్తే చాలా బాగుండేదని రానా అభిప్రాయపడ్డాడు. తన తాత లేని లోటు తనకిప్పుడు చాలా తెలుస్తోందని.. తన తాతతో సినిమా చేయలేకపోయానన్న బాధ కూడా తనను వెంటాడుతోందని రానా తెలిపాడు.

రామానాయుడి గురించి మాట్లాడుతూ.. ఓ సమయంలో రానా ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. ఒక్క నిమిషం ఆగిపోయి కన్నీళ్లు కూడా పెట్టేసుకున్నాడు. తాను ఈ రోజు సినీ పరిశ్రమలో నిలబడి ఉన్నానన్నా.. సినిమా గురించి అర్థం చేసుకున్నానన్నా అందుకు తన తాతే కారణమని రానా అభిప్రాయపడ్డాడు.