నాని మీద అంత పెట్టేశారా?

గత రెండేళ్లలో నాని ఒక మామూలు కథానాయకుడి స్థాయి నుంచి తనకంటూ ఒక ఇమేజ్ ఉన్న స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అతడి మీద ఇప్పుడు కళ్లు మూసుకుని 20 కోట్ల పెట్టుబడి పెట్టేయొచ్చు. అతడి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మినిమం పాతిక కోట్లు గ్యారెంటీ. ‘ఎవడే సుబ్రమణ్యం’తో మొదలుపెట్టి.. ‘నేను లోకల్’ వరకు నాని నటించిన ఆరు సినిమాల్లో ఏది కూడా బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా ఫెయిలవ్వలేదు.

‘మజ్ను’ అంచనాలకు తగ్గట్లుగా ఆడలేదు కానీ.. అది కూడా దాదాపుగా బ్రేక్ ఈవెన్‌కు వచ్చేసింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాక అమెరికాలో నానికి మంచి మార్కెట్ ఏర్పడింది. అక్కడ నాని సినిమా ఎలా ఉన్నా మినిమం హాఫ్ మిలియన్ గ్యారెంటీ అన్నట్లుంది పరిస్థితి.

ఈ నేపథ్యంలోనే నాని కొత్త సినిమా ‘నిన్ను కోరి’ ఓవర్సీస్ హక్కుల్ని ఏకంగా రూ.3.75 కోట్లు పెట్టి కొనుక్కుందట ఒక డిస్ట్రిబ్యూషన్ సంస్థ. కొత్త దర్శకుడు శివ నిర్వాణ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ‘నిన్ను కోరి’ మీద మంచి అంచనాలున్నాయి. ‘నేను లోకల్’ లాంటి సూపర్ హిట్ తర్వాత నాని నటిస్తున్న సినిమా ఇది. పైగా ఇది చాలా వరకు అమెరికా నేపథ్యంలో సాగే సినిమా. ఇది అక్కడి తెలుగు ప్రేక్షకుల టేస్టుకు తగ్గట్లుగా ఉంటుందంటున్నారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ దగ్గర్నుంచి నాని సినిమాలన్నీ అమెరికాలో బయ్యర్లకు లాభాలే పంచాయి.

‘భలే భలే మగాడివోయ్’ దగ్గర్నుంచి అతడి ప్రతి సినిమా కూడా మినిమం 8 లక్షల డాలర్లు వసూలు చేసింది. కాబట్టే నాని మీద అంత పెట్టుబడి పెట్టడానికి రెడీ అయిపోయాడు బయ్యర్. దీని ప్రకారం చూస్తే ‘నిన్ను కోరి’ అమెరికాలో మినిమం మిలియన్ డాలర్లు వసూలు చేస్తే తప్ప బయ్యర్ సేఫ్ కాదన్నమాట. మరి నాని విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ అయి ‘నిన్ను కోరి’ కూడా అంచనాలకు తగ్గట్లే ఆడుతుందో లేదో చూడాలి.