చరణ్ సినిమాలో ‘గొడవ’ హీరో

రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న కొత్త సినిమాకు ఒక కీలక పాత్ర కోసం ఎవ్వరూ ఊహించని విధంగా ఒక నటుడిని ఎంపిక చేశారు. ఆ నటుడు మరెవరో కాదు.. తమిళ సినీ పరిశ్రమలో బిజీగా ఉన్న తెలుగు కుర్రాడు వైభవ్ రెడ్డి. సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి కొడుకైన వైభవ్.. చరణ్-సుక్కు సినిమాలో కీలక పాత్ర చేయబోతున్నాడు. అతడి క్యారెక్టర్ చాలా స్పెషల్‌గా ఉంటుందని సమాచారం. చాలామంది పేర్లు పరిశీలించి చివరికి వైభవ్‌‌ను ఓకే చేశాడట సుక్కు. ఈ చిత్రంలో జగపతిబాబు సైతం ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్-వైభవ్ కాంబినేషన్ ఆసక్తి రేకెత్తించేదే.

వైభవ్ హీరోగా పరిచయమైంది తెలుగులోనే. కోదండరామిరెడ్డే స్వీయ దర్శకత్వంలో వైభవ్ హీరోగా ‘గొడవ’ అనే సినిమా తీశాడు. ఆ చిత్రం నిరాశ పరిచింది. తర్వాత ‘కాస్కో’ అనే ఇంకో సినిమా కూడా చేశాడతను. అదీ సరైన ఫలితాన్నివ్వలేదు. దీంతో తమిళ సినీ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడతను. అక్కడ హీరోగానే కాక క్యారెక్టర్ రోల్స్ కూడా చేసి మంచి పేరే సంపాదించాడు వైభవ్. కోదండరామిరెడ్డి-చిరంజీవిలది ఎంత పెద్ద హిట్ కాంబినేషనో అందరికీ తెలిసిందే. చిరుకు ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చాడు కోదందరామిరెడ్డి ఆ కతజ్నతతోనే ఇప్పుడు తన సినిమాలో వైభవ్‌కు ఛాన్స్ దక్కేలా చూశాడేమో చరణ్. ఈ చిత్రం ఈ నెలలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది.