అంత హంగామా చేస్తే సినిమానే ఆగిపోయింది

యాక్టింగ్ టాలెంట్, అందం రెండూ ఉన్న అమ్మాయి రెజీనా కసాండ్రా. కానీ ఆమె టాలెంటుకు, అందానికి తగ్గ అవకాశాలు మాత్రం దక్కలేదు. తెలుగులో ఒక్కో మెట్టు ఎక్కుతూ కొంచెం రైజ్ అవుతున్న టైంలో వరుస ఫ్లాపులు ఆమెను కిందికి లాగేశాయి. ఆ సమయంలోనే కొన్ని తమిళ అవకాశాలు రావడంతో సొంత ఇండస్ట్రీలోకి వెళ్లిపోయింది ఈ చెన్నై అమ్మాయి.

కెరీర్ ఓ మోస్తరుగా నడుస్తున్న టైంలో గత ఏడాది ఆమెకు ఓ బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కింది. అదే.. ఆంఖే-2. అనీస్ బజ్మి దర్శకత్వంలో విపుల్ షా ప్రొడ్యూస్ చేయాల్సిన సినిమా ఇది. ఈ సినిమాకు కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని ఓ రేంజిలో చేశారు గత ఏడాది.

ఆ వేడుక కోసం రెజీనా చాలా సెక్సీగా తయారై రావడం.. స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుండగా.. ఆమె డ్రెస్ కొంచెం అటు ఇటు అయి అదో హాట్ టాపిక్ కావడం గుర్తుండే ఉంటుంది. ఆ దెబ్బతో బాలీవుడ్లో రెజీనా పేరు బాగానే చర్చనీయాంశమైంది. ఐతే ఇంత హంగామా చేసి మొదలుపెట్టిన సినిమా ఇప్పుడు ఆగిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి. కారణాలేంటో తెలియలేదు కానీ.. ‘ఆంఖే-2’ ముందుకైతే కదలట్లేదట. కొంత భాగం షూటింగ్ చేసి మధ్యలోనే ఆపేసినట్లు సమాచారం.

రెజీనా ఇంకా షూటింగ్‌లోనే పాల్గొనలేదట. మొత్తానికి ఓ క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్టులో అవకాశం దక్కినట్లే దక్కి చేజారిపోయింది రెజీనాకు. దీంతో ఆమె బాలీవుడ్ కలలకు బ్రేక్ పడినట్లే అయింది. తమిళంలో కూడా ఆమెకు పెద్దగా అవకాశాలేమీ లేవు. చూస్తుంటే ఒకట్రెండేళ్లలో రెజీనా కెరీర్‌కు తెరపడిపోయేలా కనిపిస్తోంది.