వర్మది వైరాగ్యమా… భయమా?

తనకి అవసరం లేని విషయాల్లో వేలు పెట్టి అందరితో తిట్టించుకోవడం రాంగోపాల్‌వర్మకి సరదా అయిపోయింది. మొదట్లో కాలక్షేపంగా మొదలైనదే తర్వాత వ్యాపకమైపోయింది. కొత్తగా రిలీజ్‌ అయిన పోస్టర్‌ దగ్గర్నుంచి సినిమా వరకు తన అభిప్రాయం చెప్పడం తప్పనిసరి అన్నట్టు ఫీలయిపోయాడు. దానికి తోడు అర్థరాత్రి ట్వీట్లు, అదీ వోడ్కా మత్తులో వేసిన ట్వీట్లు పెను దుమారాన్ని రేపాయి.

‘నా ఇష్టం’ అన్నట్టు సాగిన అతని పద్ధతి చాలా ఇబ్బందుల్లో పడేసింది. లీగల్‌ పరమైన చిక్కులు సైతం తెచ్చిపెట్టింది. దాంతో కొన్నిసార్లు తన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. కొందు హీరోల అభిమానులయితే అతడికి శవయాత్రలు కూడా చేసారు. ఇటీవలి కాలంలో తనపై రివర్స్‌ ఎటాక్‌ బాగా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో వర్మ ఇక వోడ్కా తాగనని, ఇంతకుముందులా అస్సలు వుండనని తనకి నచ్చిన వాళ్లపై ఒట్టు కూడా పెట్టాడు. వర్మ సడన్‌గా ఎందుకిలాంటి స్టేట్‌మెంట్‌ ఇచ్చాడనేది అర్థం కాలేదు.

అదే పనిగా అవతలి వారిపై పిచ్చి కామెంట్లు చేస్తూ తన గౌరవం కోల్పోతున్నందుకు వచ్చిన వైరాగ్యమా లేక ఇలాంటి వ్యాఖ్యల వల్ల కొందరితో లేని పోని వైరం కొని తెచ్చుకుంటున్నాననే భయమా, లేక ఈ ఒట్టు కూడా ఎప్పటిలా తన వోడ్కా మత్తులో చేసిన ఒట్టి కల్లబొల్లి ప్రమాణమేనా? వర్మ ఏం చెప్పినా నమ్మడానికి లేదు మరి.