అప్పుడు చిరుపై.. ఇప్పుడు పవన్‌పై

ఆ మధ్య ‘ఖైదీ నెంబర్ 150’కి సంబంధించి చిరు మాస్ అవతారంలో ఉన్న ఒక పోస్టర్ వదిలింది చిత్ర బృందం. అది చూసి రామ్ గోపాల్ వర్మ మరీ ఎటకారపు కామెంట్లు చేశాడు. ఈ పోస్టర్ ‘అవతార్’ పోస్టర్ కన్నా గొప్పగా ఉందని.. జేమ్స్ కామెరూన్.. స్టీఫెన్ స్పీల్ బర్గ్ లాంటి హాలీవుడ్ దర్శకులు ఈ పోస్టర్ చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని వ్యాఖ్యానించాడు వర్మ. ఈ విషయం చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో కూడా ప్రస్తావించాడు. వర్మకు ఎటకారం బాగా ఎక్కువైపోయిందని వ్యాఖ్యానించాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా వర్మ పవన్ ను పొగుడుతూ.. మీ విషయంలో మాత్రం ఎటకారాలు ఎందుకాడతాడని అడిగితే.. వర్మ పవన్ ను కూడా చాలాసార్లు కించపరిచాడని అన్నాడు చిరు.

చిరు మాటల్ని నిజం చేస్తూ అప్పుడు చిరు మీద ఎటకారాలాడినట్లే.. ఇప్పుడు పవన్ ను కూడా ఎద్దేవా చేస్తున్నాడు వర్మ. ప్రత్యేక హోదాపై పోరాటం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తాజాగా విడుదల చేసిన ‘దేశ్ బచావో’ ఆల్బం మీద వర్మ తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. ఈ పాటలపై ఆల్రెడీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఉద్యమం కోసం ప్రత్యేకంగా పాటలు రూపొందించకుండా.. పవన్ సినిమాలోని కొన్ని పాటల్ని తీసుకుని.. వాటికి పవన్ బహిరంగ సభల్లో చేసిన వ్యాఖ్యానాల్ని జోడించి.. ర్యాప్ తరహాలో పాటలు తయారు చేయడంపై సెటైర్లు పడుతున్నాయి. వర్మ కూడా ఈ పాటలపై తనదైన శైలిలో కామెడీ చేశాడు. దేశ్ బచావో పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయని.. గుండె లోతుల్లోకి వెళ్లేలా హార్డ్ హిట్టింగ్ గా ఆ పాటలున్నాయని.. నిజమైన మనిషి ఎవడూ కూడా ఈ పాటలు విన్నాక కదిలిపోకుండా ఉండలేడని వ్యాఖ్యానించాడు వర్మ. రస్టిక్ వాయిస్.. థండరింగ్ లిరిక్స్.. డైనమిక్ స్ట్రోక్.. అంటూ పెద్ద పెద్ద పదాలే వాడుతూ ట్వీట్లు గుప్పించాడు వర్మ. ఆయన ఉద్దేశమేంటన్నది జనాలకు బాగానే అర్థమైపోయిందిలెండి.