సచిన్ ఫ్యాన్స్.. గెట్ రెడీ అమ్మా

గ‌త కొన్నేళ్లుగా ఇండియాలో స్పోర్ట్స్ బ‌యోపిక్స్ హ‌వా న‌డుస్తోంది. మ‌హేంద్ర‌సింగ్ ధోని క్రికెట్ కెరీర్ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఎం.ఎస్‌.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ‌’ గత ఏడాది అనూహ్యమైన విజయాన్నందుకుంది. రెగ్యుల‌ర్ సినిమాలకు దీటుగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. ధోని సినిమానే జనాల్లో అంత ఆసక్తి రేకెత్తిస్తే.. భారత క్రికెట్ దేవుడిగా గుర్తింపు తెచ్చుకున్న సచిన్ టెండూల్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత ఏడాది దీని టీజర్ వచ్చినప్పటి నుంచే సచిన్ అభిమానుల్లో సినిమా ఎప్పుడొస్తుందా అన్న ఉత్కంఠ పెరిగిపోయింది. ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రైలర్ లాంచ్‌కు రంగం సిద్ధం చేశారు.

గురువారం రాత్రి 7 గంటలకు ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్’ ట్రైలర్ రాబోతోంది. ట్రైలర్ విడుదల నేపథ్యంలో వదిలిన పోస్టర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. సచిన్ కెరీర్లోని రకరకాల ఫొటోలతో పాటు.. అతడి కెరీర్‌ను ప్రభావితం చేసిన అన్ని అంశాల ప్రస్తావన ఇందులో కనిపిస్తోంది. సినిమాలో ఏమేం ఉండబోతున్నాయో ఈ పోస్టర్‌ను బట్టి చెప్పేయొచ్చు. మరి ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.

ఈ చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కార్నివాల్ మోష‌న్ పిక్చ‌ర్స్ సంస్థ‌ ‘సచిన్’ సినిమాను నిర్మిస్తుండగా.. బ్రిటన్ డైరెక్టర్ జేమ్స్ ఏర్స్‌కిన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతాన్నందిస్తున్నాడు. స‌చిన్‌కున్న ఫాలోయింగ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని దేశంలోని అనేక భాష‌ల్లోకి అనువాదం చేస్తార‌ని స‌మాచారం. ఐతే స‌చిన్ సినిమా ‘ధోని’ తరహా ఫీచర్ ఫిల్మ్ కాదు. కొంచెం డాక్యుమెంటరీ టచ్ ఉంటుంది. సచిన్ ఆడిన మ్యాచ్ లకు సంబంధించిన రియల్ విజువల్స్ ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. చిన్నప్పటి జీవితాన్ని మాత్రం నటన ద్వారా చూపిస్తారు. స్వయంగా సచినే ఈ చిత్రాన్ని నరేట్ చేయబోతుండటం విశేషం.