రివ్యూయర్లపై విరుచుకుపడ్డ సల్మాన్

ఈ మధ్య సినీ తారలు రివ్యూయర్లను తిట్టిపోయడం కామన్ అయిపోయింది. మంచి సినిమా తీసినపుడు దానికి రివ్యూలు తోడ్పాటు అందించి.. సినిమా బాగాలేనపుడే అవి చేటు చేస్తాయన్న వాస్తవాన్ని విస్మరించి.. రివ్యూలు రాసే వాళ్లపై విరుచుకుపడుతున్నారు కొందరు తారలు.

ఈ కోవలోకి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా చేరాడు. ఆయన సమీక్షకులపై విమర్శనాస్త్రాలు సంధించాడు. రివ్యూయర్లు సినిమా విడుదలైన రోజే సమీక్షలు రాయడం వల్ల చాలా నష్టం జరుగుతోందని సల్మాన్ అభిప్రాయపడ్డాడు. మా కష్టాన్ని దోచుకునే హక్కు మీకెక్కుడుంది అంటూ సల్మాన్ ప్రశ్నించాడు.

తాను ‘క్రిటిక్ ప్రూఫ్’ సినిమాలే తీస్తానని.. రివ్యూల వల్ల తన సినిమాల మీద అసలే ప్రభావం ఉండదని అన్నాడు సల్మాన్. తన సినిమాలకు కొన్నిసార్లు జీరో రేటింగ్స్ వచ్చిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘జీరో’ కాదు.. మైనస్ 100 రేటింగ్స్ ఇవ్వండి.. ఏం జరుగుతుందో చూస్తా అంటూ సవాలు విసిరాడు సల్మాన్ ఖాన్. ఐతే సల్మాన్ చెత్త సినిమాలకు చెత్త రేటింగులే వచ్చాయి.

అదే సమయంలో భజరంగి భాయిజాన్, సుల్తాన్ లాంటి సినిమాలు చేసినపుడు వాటికి చాలా మంచి సమీక్షలు, రేటింగ్స్ వచ్చాయి. అవి సినిమా వసూళ్లు పెరగడానికి ఎంతో కారణమయ్యాయి. సల్మాన్ గత సినిమాల కంటే ఇవి పెద్ద విజయం సాధించాయంటూ ఇవి మంచి సినిమాలంటూ సమీక్షల ద్వారా జనాలకు తెలియడం వల్లే కదా?