మెగా ఊపుతో బరిలోకి ఎన్నెన్నో

సంక్రాంతికి రిలీజ్‌ అయిన మూడు సినిమాలు విజయవంతం కావడంతో సినిమా బిజినెస్‌ కళకళలాడిపోతోంది. చేతినిండా డబ్బులు కనిపించడంతో బయ్యర్లు ఉత్సాహంగా మరిన్ని సినిమాలు కొనేస్తున్నారు. సాధారణంగా సినిమాల్లేక డల్లుగా వుండే ఫిబ్రవరి ఈసారి మల్టిపుల్‌ రిలీజులతో సినీ ప్రియులకి థ్రిల్‌ ఇవ్వనుంది.

ఫిబ్రవరిలో అరడజనుకి పైగా చెప్పుకోతగ్గ చిత్రాలు రిలీజ్‌ అవుతున్నాయంటే థియేటర్స్‌ ఫీడింగ్‌కి లోటు వుండదని సినిమా ట్రేడ్‌ సంతోష పడుతోంది. మామూలుగా సంక్రాంతి సినిమాల సందడి ముగిసిన తర్వాత థియేటర్ల ఫీడింగ్‌ కోసం నానా పాట్లు పడాల్సి వస్తుంది. మార్చి నెలాఖరు వరకు అదే పరిస్థితి వుంటుంది. కానీ ఈసారి చాలా సినిమాలు విడుదల కానుండడం వల్ల ఆ బాధ లేదు.

కాకపోతే వారానికో సినిమా అయినా రిలీజ్‌ అవుతోన్న ఈ దశలో సత్తా వున్న చిత్రాలు తప్ప మిగతావి సర్వయివ్‌ అవడం కష్టమే. 3న నేను లోకల్‌, 9న సింగం 3, 10న ఓం నమో వెంకటేశ, 17న ఘాజీ, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, 24న విన్నర్‌ రిలీజ్‌ అవుతున్నాయి. ఇవి కాకుండా గుంటూరోడు, లక్ష్మిబాంబ్‌, చిత్రాంగద తదితర స్ట్రెయిట్‌ చిత్రాలతో పాటు మరికొన్ని అనువాద చిత్రాలతో ఫిబ్రవరి సినీ ప్రియులని ఉక్కిరిబిక్కిరి చేయనుంది.