దాస‌రికి ఇప్పుడు ఎలా వుంది

ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు ఆరోగ్యం కాస్త నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఊపిరితిత్తులు, మూత్ర‌పిండాల్లో ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా సోమ‌వారం ఉద‌యం ఆయ‌న కిమ్స్ ఆసుప‌త్రిలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న్ని ఐసీయూలో వెంటిలేట‌ర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్న‌ట్లు.. ఇన్ఫెక్ష‌న్ తొల‌గించ‌డానికి శ‌స్త్ర చికిత్స చేయ‌నున్న‌ట్లు మ‌ధ్యాహ్నం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో కిమ్స్ ఆసుప‌త్రి ఎండీ, సీఈవో డాక్టర్ బొల్లినేని భాస్కరరావు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌ధ్యాహ్నం త‌ర్వాత శ‌స్త్ర చికిత్స కూడా పూర్త‌యింది. అనంత‌రం మోహ‌న్ బాబుతో క‌లిసి భాస్క‌ర‌రావు మీడియాతో మాట్లాడారు.

అన్నవాహికలో ఉన్న పదార్థాల వల్లే ఇన్ఫెక్షన్ వ‌చ్చింద‌ని.. వాటన్నింటినీ శస్త్రచికిత్స ద్వారా తీసేశామని డాక్ట‌ర్ భాస్క‌ర‌రావు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతానికి దాస‌రి చాలా బాగున్నారని.. రెండు మూడు రోజుల్లో బాగా కోలుకోడానికి ఆస్కారం ఉందని చెప్పారు. ఇంత‌కుమించి ఇప్ప‌టికి ఇంకేమీ చెప్పలేనన్నారు. మోహ‌న్ బాబు మాట్లాడుతూ.. త‌న గురువు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ కావల్సిన మనిషని.. ఆయ‌న త‌ప్ప‌కుండా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. దాసరి నూరేళ్లు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని.. అందరూ కూడా ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించాలని కోరారు. మోహ‌న్ బాబు ఉద‌యం నుంచి కిమ్స్‌లోనే ఉంటూ అక్క‌డి ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు. దాస‌రి త‌న‌యుడు అరుణ్ కుమార్‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు కిమ్స్‌లోనే ఉన్నారు.