అనవసరంగా ‘కాటమరాయుడు’ను చూసి భయపడి..

సంక్రాంతి పండక్కి ‘శతమానం భవతి’లో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు శర్వానంద్. ఈ ఊపులో తన కొత్త సినిమా ‘రాధ’ను కూడా చకచకా పూర్తి చేసి మార్చి 29కే ప్రేక్షకుల ముందుకు తెచ్చేయాలని చూశాడు. ముందు టీజర్ లాంచ్ చేసి.. ఆ తర్వాత పాటలు కూడా ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ప్రమోషన్ జోరు కూడా పెంచాలని ప్లాన్ చేసింది ఈ చిత్ర యూనిట్. సినిమా మీద పాజిటివ్ బజ్ ఉండటంతో అగ్రెసివ్ ప్రమోషన్లతో సినిమాను ఉగాది కానుకగా రిలీజ్ చేయడానికే ఫిక్సయింది ‘రాధ’ టీం. కానీ ఉన్నట్లుండి రిలీజ్ విషయంలో మనసు మార్చుకున్నారు.

మార్చి 24న ‘కాటమరాయుడు’ భారీ అంచనాల మధ్య రిలీజవుతుండటంతో దానికి ఎదురెళ్లడం ఎందుకని ఈ సినిమాను వాయిదా వేసేశారు. తీరా చూస్తే ‘కాటమరాయుడు’ బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపించలేకపోయాడు. ఆ సినిమా ప్రతాపం ఫస్ట్ వీకెండ్‌ వరకే పరిమితమైంది. ఆ తర్వాత సినిమా నామమాత్రంగా నడుస్తోంది. ఈ అడ్వాంటేజీని వాడుకోవడానికి ‘గురు’ ముందుకొచ్చి.. 31న రిలీజైపోతోంది.

శర్వా సినిమా అనుకున్న ప్రకారం ఉగాది రోజు రిలీజై ఉంటే కచ్చితంగా దానికి అడ్వాంటేజీ అయ్యేది. అనవసరంగా ‘కాటమరాయుడు’ను చూసి భయపడి.. సినిమాను వాయిదా వేశారు. మంచి అవకాశాన్ని కోల్పోయారు. ఇక ఏప్రిల్ అంతా కూడా డేట్లు ఖాళీ లేకపోవడంతో మేలో కానీ ఈ సినిమాను విడుదల చేసే అవకావం లేదు.