స్పైడర్.. 59 క్షణాల విందు

మహేష్ బాబు కొత్త సినిమా ‘స్పైడర్’ అభిమానుల్ని మొదట్నుంచి చాలా ఫ్రస్టేట్ చేస్తూ వస్తోంది. ఈ సినిమా టైటిల్ కోసం.. ఫస్ట్ లుక్ పోస్టర్ల కోసం అభిమానులు ఎంతగా నిరీక్షించారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇదిగో అదిగో అంటూ నెలలు నెలలు వాయిదా వేసి చివరికి గత నెలలో ఈ తంతు కానిచ్చారు.

ఫస్ట్ లుక్ పోస్టర్లు అంచనాలకు తగ్గట్లే ఉండటంతో అభిమానులు శాంతించారు. ఇక ఆ తర్వాత ఫస్ట్ టీజర్ కోసం నిరీక్షణ మొదలైంది. అదెప్పుడొస్తుందనే విషయంలోనూ క్లారిటీ లేదు. మరోవైపు రిలీజ్ డేట్ విషయంలో నెలకొన్న గందరగోళంలో పడి అభిమానులు ఫస్ట్ టీజర్ గురించి పట్టించుకోవడం మానేశారు.

ఐతే తాజా సమాచారం ప్రకారం ‘స్పైడర్’ ఫస్ట్ టీజర్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కానుకగా ఈ నెల 31న ప్రేక్షకుల్ని పలకరించబోతోందట. 59 సెకన్ల నిడివితో ఈ టీజర్‌ను తీర్చిదిద్దినట్లు సమాచారం. తన టీజర్లు.. ట్రైలర్ల విషయంలో చాలా శ్రద్ధ పెట్టే మురుగదాస్.. ‘స్పైడర్’ టీజర్‌ను కూడా చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ టీజర్ చూశాక సినిమా విషయంలో ఉన్న నెగెటివిటీ అంతా పక్కకు వెళ్లిపోతుందని.. సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతాయని అంటున్నారు.

‘స్పైడర్’ క్లైమాక్స్ చిత్రీకరణ ఇటీవలే పూర్తి కాగా.. ఇంకో రెండు పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. మరోవైపు వీఎఫెక్స్ వర్క్‌తో పాటు మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి సెప్టెంబర్లో విడుదలవుతుంది.