‘మామ్’ తెలుగు లో మాట్లాడతాదంట

బాలీవుడ్ వెళ్లిపోయాక.. అక్కడ కూడా స్టార్ హీరోయిన్ అనిపించుకున్నాక శ్రీదేవికి సౌత్ ఇండస్ట్రీ మీద ఒక రకమైన చిన్న చూపు ఏర్పడిన మాట వాస్తవం. ముఖ్యంగా తనకు లైఫ్ ఇచ్చిన తెలుగు సినిమాల్ని ఆమె లైట్ తీసుకుంది. 90ల్లో రాఘవేంద్రరావు, రామ్ గోపాల్ వర్మ లాంటి అగ్రశ్రేణి దర్శకుల్ని చూసి రెండు మూడు సినిమాల్లో చేసింది కానీ.. అవి కాకుండా చాలా ఆఫర్లను ఆమె తిరస్కరించింది.

ఐతే అప్పట్లో బిజీగా ఉంది కాబట్టి.. డేట్లు సర్దుబాటు చేయడం కష్టమై ఉండొచ్చు. కానీ ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించి, పెద్దగా ఆఫర్లు లేకుండా ఉన్న సమయంలో ‘బాహుబలి’ కోసం అడిగితే తిరస్కారం చూపడమేంటో మరి? ఆమె నో చెప్పడానికి పారితోషకం కూడా ఒక కారణం అన్నారు కానీ.. తమిళ ‘పులి’ని మాత్రం ఇంకా తక్కువ రెమ్యూనరేషన్‌కే ఒప్పుకున్న మాటను ఇక్కడ గుర్తుంచుకోవాలి.

ఈ సంగతంతా ఇప్పుడెందుకయ్యా అంటే.. శ్రీదేవి వారు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆమె కొత్త సినిమా ‘మామ్’ను తెలుగులోకి అనువదిస్తుండగా.. అందులో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుందట శ్రీదేవి. ఇది ఆమెకు 300వ సినిమా కావడం విశేషం. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలోనూ దీన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ భాషలన్నింట్లోనూ ఆమే తన పాత్రకు డబ్బింగ్ చెబుతుందట.

శ్రీదేవి వాయిస్‌ను మళ్లీ తెలుగులో వినే అద్భుత అవకాశం అంటూ ఈ సినిమా మేకర్స్ ప్రెస్ నోట్ ఇవ్వడం విశేషం. అయినా శ్రీదేవి ‘మామ్’ అనే సినిమా చేసినట్లే తెలుగు జనాలకు తెలియదు. ఈ సినిమాను అనువాదం చేసి రిలీజ్ చేసినా పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు. శ్రీదేవిని ఇంకా అతిలోక సుందరిగా భావించి ఆమె సినిమాల కోసం ఆత్రంగా ఎదురు చూసే పరిస్థితులు ఇప్పుడేమీ లేవు. మరి ఆమె సొంతంగా డబ్బింగ్ చెబితే ఏంటి.. చెప్పకపోతే ఏంటి?