మిస్టర్‌ వైట్ల మారాడు… కానీ

శ్రీను వైట్ల తాజా చిత్రం ‘మిస్టర్‌’ ట్రెయిలర్‌ చూస్తే ఒకటి క్లియర్‌గా తెలుస్తుంది… ఇది అతని మార్కు ‘ఢీ’ సినిమా స్క్రీన్‌ప్లేతో తెరకెక్కలేదని. ఢీ, రెడీ సక్సెస్‌ అవడంతో ఒకే కథని తిప్పి, తిప్పి తీసుకుంటూ వచ్చిన వైట్లకి ఆగడు, బ్రూస్‌లీ చిత్రాలతో దెబ్బలు తగిలాయి. దాంతో పంథా మార్చక తప్పింది కాదు. స్టార్‌ హీరోలు తనని చూడకపోయే సరికి యువ హీరో వరుణ్‌ తేజ్‌తో మిస్టర్‌ చేసాడు.

ఈ చిత్రం వైట్ల మార్కు రిచ్‌నెస్‌తో కనిపిస్తోంది కానీ అతని పాత సినిమాల వాసనలైతే లేవు. అయితే అదే సమయంలో ఈ చిత్రం ట్రెయిలర్‌లో కామెడీ బాగా తగ్గింది. శ్రీను వైట్ల, త్రివిక్రమ్‌ సినిమాల్లో ఏ అంశాలు ఎలాగున్నా కామెడీ మాత్రం బాగా వుండాలని జనం కోరుకుంటారు. మిస్టర్‌ ట్రెయిలర్‌లో కూడా కామెడీ బిట్లు వున్నాయి కానీ అవి అంతగా నవ్వించలేదు. శ్రీను వైట్ల సినిమాల్లోని కామెడీ పంచ్‌లు తలచుకుని తలచుకుని నవ్వుకునేలా వుంటాయి.

దూకుడు, సొంతం, ఆనందం తదితర చిత్రాల్లో గుర్తుండిపోయే కామెడీని తెరకెక్కించిన దిట్ట అతను. తన స్టయిల్‌ మార్చమన్నారని కామెడీని కూడా టోన్‌ డౌన్‌ చేసేసాడా అనే అనుమానం కలుగుతోంది. మిగతా ట్రెయిలర్‌లోని అంశాలు కూడా రొటీన్‌గా అనిపించిన దరిమిలా ఇలాంటి రొటీన్‌ కథలకి కామెడీ కోటింగ్‌ బాగా అవసరం. ట్రెయిలర్‌లో సరిగ్గా కన్వే కాలేకపోయినా సినిమాలో వైట్ల మార్కు నవ్వుల విందుకి లోటేమీ వుండదనే ఆశిద్దాం.