సిగ్గు పడుతున్నానంటున్న సుక్కు

‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ గురించి సోషల్ మీడియాలో ఎంత చర్చ నడిచిందో.. ఇప్పుడు ‘కేశవ’ టీజర్ గురించి దాని స్థాయిలో అంతే డిస్కషన్ నడుస్తోంది. మొన్న రిలీజైన ఈ టీజర్ తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని మిగిల్చింది. వైవిధ్యమైన సినిమాలతో దూసుకెళ్తున్న నిఖిల్.. మరోసారి ప్రామిసింగ్‌ టీజర్‌తో ప్రేక్షకుల్ని పలకరించాడు.

‘స్వామిరారా’తో సెన్సేషన్ క్రియేట్ చేసి.. ‘దోచేయ్’తో ఎదురుదెబ్బ తిన్న సుధీర్ వర్మ.. ఈసారి చాలా కసితో సినిమా చేసినట్లే ఉంది ‘టీజర్’ చూస్తుంటే. ఈ టీజర్ చూసి సామాన్య ప్రేక్షకులే కాదు.. విలక్షణ దర్శకుడు సుకుమార్ సైతం చాలా ఎగ్జైట్మెంట్‌తో మాట్లాడటం విశేషం.

‘కేశవ’ కథను నిర్మాత కంటే ముందు తనకే సుధీర్ చెప్పాడని.. కథ అంతా విన్నాను కాబట్టి టీజర్ తనకేమీ అంత ఎగ్జైట్మెంట్ కలిగించదని అనుకున్నానని.. కానీ టీజర్ అద్భుతంగా ఉందని.. అది చూసి తాను స్టన్ అయిపోయానని సుకుమార్ చెప్పాడు. ఈ టీజర్ కంటే ముందుగా సినిమాలోని కొన్ని పోర్షన్లు తనకు సుధీర్ చూపించాడని.. కథ చెప్పినపుడు ఏదో అనుకున్నానని.. కానీ సుధీర్‌ లోపల ఎన్ని ఆలోచనలున్నాయో రష్ చూశాక తనకు అర్థమైందని సుకుమార్ తెలిపాడు.

ఈ సినిమాలో అడవి నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాల్ని తన సొంత ఊరైన కాకినాడకు దగ్గర్లోని మడ అడవుల్లో తీశారని.. అక్కడ అంత మంచి లొకేషన్లున్నాయని తనకు తెలియదని సుక్కు చెప్పాడు. తమ ఊరి పక్కన అంత మంచి లొకేషన్లు పెట్టుకుని తాను లండన్లో.. స్పెయిన్లో సినిమాలు తీసుకుంటున్నానని.. ఇందుకు తనకు సిగ్గుగా ఉందని సుక్కు చెప్పడం విశేషం.