బీసీసీఐకి సుప్రీం షాక్

అనుకన్నంత పనీ అయింది. సుప్రీం కోర్టు బీసీసీఐ కొంప ముంచింది. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే పదవులు ఊడపీకింది. లోథా కమిటీ సిఫార్సులు అమలుచేయలేదని పనిష్మెంట్ ఇచ్చింది.

లోథా కమిటీ సిఫార్సులపై సుప్రీం పట్టుదలగా ఉందని తెలిసి కూడా నాటకాలాడిన అనురాగ్ ఠాకూర్ కు తగిన శిక్ష పడిందని బోర్డులో ఆయన ప్రత్యర్థులు చంకలు గుద్దుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఠాకూర్ కు రీప్లేస్ మెంట్ ఎవరు, సుప్రీంకోర్టే నిర్ణయిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

అనురాగ్ ఠాకూర్ ను మొదట భయపెట్టాలని ప్రయత్నించిన సుప్రీంకోర్టు.. ఆయన ఏకంగా ఐసీసీని ఆశ్రయించడంతో.. కొరడా ఝుళిపించింది. ఠాకూర్ సుప్రీం చెప్పినవన్నీ కాకపోయినా.. కొన్నైనా అమలు చేసి ఉండాల్సిందనే వాదన వినిపిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పుతో అనురాగ్ ఠాకూర్ కు షాక్ తగిలింది.

గతంలో బీసీసీఐ బాధ్యతలు గవాస్కర్ చేపట్టాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అటు లోథా ప్యానెల్ మాత్రం మాజీ హోం శాఖ కార్యదర్శి పిళ్లై పేరు సూచించింది. ఇప్పుడు వీరిద్దరిలో ఎవరైనా బాధ్యతలు తీసుకుంటారా, లేదంటే వేరే వాళ్లు తెరపైకి వస్తారా అనేది ఉత్కంఠగా మారింది.