సూర్య సినిమాతో ఫుట్‌బాల్‌

‘సింగం 3’ ఇంకోసారి వాయిదా పడింది. డిసెంబర్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల వెనక్కి పోతూ వచ్చింది. సంక్రాంతికి తమిళనాడులో ఒకటే సినిమా వుంది కనుక దీనిని కూడా విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ తెలుగు వెర్షన్‌కి థియేటర్లు దొరకవనే భయంతో జనవరి 26న విడుదల చేద్దామని నిర్ణయించుకున్నారు.

గత రెండు రోజులుగా ఈ చిత్రం విడుదల వాయిదా పడుతుందంటూ వార్తలు వస్తుంటే, ఇవాళ పొద్దున్నే ‘ఆరు నూరైనా ఇరవై ఆరున సింగం 3’ రిలీజ్‌ అవుతుందంటూ సగర్వంగా ప్రకటించారు. కానీ తమిళనాడులో జరుగుతోన్న జల్లికట్టు ఉద్యమం విధ్వంసకంగా మారడంతో అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇలాంటి టైమ్‌లో ఇంత పెద్ద చిత్రం రిలీజ్‌ చేయడం సబబు కాదని మరోసారి సింగం 3ని అధికారికంగా వాయిదా వేసారు. ఫిబ్రవరి నెలాఖరులో ఈ చిత్రం రిలీజ్‌ అవుతుందనేది తాజా సమాచారం. అదే జరిగితే ఇంతటి భారీ చిత్రానికి ఎలాంటి సెలవులు లేని సీజన్‌లో రిలీజ్‌ ఉంటుంది.

పైగా అటు తమిళంలో, ఇటు తెలుగులో ఎన్ని సినిమాలతో క్లాష్‌ పడుతుందో కూడా తెలియని పరిస్థితి. అసలే కాలం కలిసి రాక ఫ్లాపులు చవిచూస్తున్న సూర్యకి తనకి అత్యంత సక్సెస్‌ఫుల్‌ ఫ్రాంచైజీ అయిన సింగం 3ని ఇలా విధి ఫుట్‌బాల్‌ ఆడేసుకుంటోంది. నెమ్మదిగా ఆసక్తి కిల్‌ అయిపోతున్న ఈ సింగం రిలీజ్‌ అయిన తర్వాత ఏమాత్రం గర్జిస్తుందో ఏమో మరి.