నంద్యాల ఉత్కంఠ బ్రేక్ త‌ర్వాత తేలుతుంద‌ట‌

తెలుగుదేశం పార్టీలో, కర్నూలు జిల్లా రాజకీయాల్లో నెల‌కొన్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డేందుకు మరింత సమయం పట్టేలా ఉందని అంటున్నారు. అదే నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిత్వం విషయం. పోటీలో నిలిచే అభ్యర్థి విషయంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోగడువు విధించారు. తన అమెరికా పర్యటన తర్వాత నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎవరనేది ఖరారు కానుందని తెలిపారు.

సీటు ఆశిస్తున్న శిల్పా మోహన్‌రెడ్డి, భూమా కుటుంబానికి సలహాదారైన ఏవీ సుబ్బారెడ్డి  చంద్రబాబును కలిశారు. తనకు సీటు ఇవ్వకపోతే రాజకీయంగా దెబ్బతింటానని, ఇన్నేళ్లు సంపాదించుకున్న వర్గం, ఇమేజ్ పోతుందని బాబుకు శిల్పా చెప్పారు. గత ఎన్నికల్లో కూడా తానే పోటీ చేసినందున ఈసారి కూడా తనకే టికెట్ ఇవ్వడం భావ్యమని, ఏ విషయం త్వరగా తేలిస్తే కేడర్‌లో గందరగోళం ఉండదని ఆయన బాబుకు సూచించినట్లు సమాచారం.తర్వాత భూమాకు ఆప్తుడైన ఏవీ సుబ్బారెడ్డి కూడా బాబును కలిశారు.

భూమా కుటుంబానికి టికెటిస్తే దాదాపు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉందని ఆయన అన్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు వైసీపీ నాయకత్వంతో చర్చలు జరుగుతున్నాయని, పైగా నంద్యాలలో ఇప్పుడు ఆ పార్టీకి సరైన అభ్యర్థి కూడా ఎవరూ లేరని ఆయన చెప్పినట్టు తెలిసింది.

ఈ క్రమంలో ఇద్దరి వాదనలు విన్న బాబు తాను అమెరికా నుంచి వచ్చిన తర్వాత అభ్యర్థిని ఖరారు చేద్దామని, అయితే సీటు ఎవరికి ఇచ్చినా మరొకరు అభ్యర్థి విజయం కోసం పనిచేయాలని ఆదేశించారు. అందుకు ఇద్దరూ అంగీకరించినట్లు చెబుతున్నారు. బాబుతో భేటీ అనంతరం బయటకొచ్చి మీడియాతో మాట్లాడిన శిల్పా మోహన్‌రెడ్డి తమ చర్చలు అర్థవంతంగానే జరిగాయని, బాబు అన్నీ విన్నారని చెప్పారు.

గత ఎన్నికల్లో తానే పోటీ చేసినందున మళ్లీ తనకే టికెట్ ఇవ్వాలని కోరారని, అయితే భూమా వాళ్లు కూడా అడుగుతున్నారని చెప్పారు. టికెట్ ఎవరికి ఇచ్చినా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు.