టాక్ ఆఫ్ ద నేషన్.. ఆయన మనోడే

లవ్ అగర్వాల్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న పేరు. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా ప్రతి రోజూ దేశంలో కరోనా కేసులు, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, ఇతర అంశాలపై దేశ ప్రజలకు అప్ డేట్స్ ఇస్తున్న వ్యక్తి ఈయనే.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలో కేంద్రంలో ప్రధాని లేదా మంత్రులు మీడియాను అడ్రస్ చేయట్లేదు. కరోనాకు సంబంధించి ప్రతి అప్ డేట్ లవ్ అగర్వాల్‌ నుంచే వస్తోంది.

ఇంత పెద్ద అంశం మీద ప్రతి రోజూ సమాచారాన్ని పంచుకోవడం, జనాలకు దిశా నిర్దేశం చేయడం.. మీడియాను ఫేస్ చేయడం.. మహా మహా జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు.

ఈ బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు లవ్ అగర్వాల్. చాలా ప్రశాంతంగా ఉంటూ చక్కగా మాట్లాడుతూ.. జనాల్లో భరోసా కల్పిస్తూ మీడియాను ఆయన డీల్ చేస్తున్న వైనం ప్రశంసలు అందుకుంటోంది.

దీంతో నెటిజన్లు ఎవరీ లవ్ అగర్వాల్ అని గూగుల్లో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాడెర్ అధికారి కావడం విశేషం. 1996 బ్యాచ్‌కు చెందిన ఈ ఐఏఎస్ అధికారికి అగర్వాల్‌కు తెలుగు వచ్చు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాక.. తెలుగు రాష్ట్రం విడిపోయాక తెలంగాణలోనూ పని చేశారు.

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా ఒకప్పుడు ఆయన చాలా మంచి పేరు సంపాదించారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యా శాఖ డైరెక్టర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.

రాష్ట్రం విడిపోయాక 2014లో తెలంగాణ క్రీడలు, యువజన శాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఆపై డిప్యుటేషన్ మీద కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆ బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తూ జాతీయ స్థాయిలో పేరు సంపాదించారు. లవ్ అగర్వాల్ సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ అయినప్పటికీ.. ఆయన అధికారిగా ఎక్కువ కాలం పని చేసింది మాత్రం తెలుగు గడ్డ మీదే.