తమిళ రీమేక్ కు యువ దర్శకుడి డైలాగ్స్

దర్శకుడు తరుణ్ భాస్కర్ కు భిన్న శైలి ఉంది. ఇప్పటివరకూ దర్శకుడిగా చేసినవి రెండు సినిమాలే. పెళ్లి చూపులు చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన తరుణ్ భాస్కర్, ఈ నగరానికి ఏమైంది చిత్రంతో యువతకు చేరువయ్యాడు. ముఖ్యంగా ఈ రెండు సినిమాల్లో డైలాగ్స్ ఎంత బాగా పేలాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ రెండు చిత్రాల బలం డైలాగ్స్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు డైలాగ్స్ మీద ఉన్న ఈ గ్రిప్, తరుణ్ భాస్కర్ కు కొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది.

తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఓ మై కడవులే చిత్రాన్ని పివిపి సంస్థ విశ్వక్ సేన్ హీరోగా నిర్మిస్తోంది. దీనికి ఒక యువ దర్శకుడ్ని ఎంపిక చేసుకుంది. అయితే డైలాగ్స్ మాత్రం తరుణ్ భాస్కర్ చేతే రాయించుకోవాలని పివిపి సంస్థ బలంగా ఫిక్స్ అయింది. ఇందుకోసం తరుణ్ కు భారీ మొత్తంలో పారితోషికం కూడా అందుకోబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే తరుణ్ భాస్కర్ డైలాగ్ వర్క్ ను స్టార్ట్ చేసాడట. దర్శకుడిగా తన మూడో సినిమాను విక్టరీ వెంకటేష్ తో ప్లాన్ చేసాడు తరుణ్. అయితే వెంకీకి ఉన్న కమిట్మెంట్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి సమయం పడుతోంది. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.