సుప్రీమ్‌, బిచ్చగాడు సీన్‌ రిపీట్‌

గత ఏడాదిలో వారం గ్యాప్‌లో రిలీజ్‌ అయిన సుప్రీమ్‌, బిచ్చగాడు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించాయి. రెండు సినిమాలు కాస్త నెమ్మదిగానే మొదలు పెట్టినప్పటికీ, బ్రహ్మూత్సవం ఫ్లాప్‌ అవడంతో ఈ చిత్రాలు ఊపందుకుని పెద్ద లెవల్‌కి చేరుకున్నాయి.

అనుకోకుండా ఇప్పుడు అదే హీరోల సినిమాలు ఒకే టైమ్‌లో రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయి. ఇంతకుముందు వారం గ్యాప్‌ వుంటే, ఈసారి మాత్రం రెండూ ఒకే రోజున రిలీజ్‌ అవుతున్నాయి. సాయి ధరమ్‌ తేజ్‌ విన్నర్‌, విజయ్‌ ఆంటోనీ నటించిన యమన్‌ ఈ శుక్రవారం రిలీజ్‌ అవుతుండగా ఈ రెండు సినిమాలపై బయ్యర్లకి, ట్రేడ్‌కి చాలా అంచనాలున్నాయి. బిచ్చగాడుతో వచ్చిన పాపులారిటీతో విజయ్‌ ఆంటోనీ మరోసారి ఇక్కడ సత్తా చాటుతాడని నమ్ముతున్నారు.

అలాగే సాయి ధరమ్‌ తేజ్‌కి మాస్‌లో పెరుగుతోన్న ఆదరణ ఈసారి కూడా అతడిని ‘విన్నర్‌’గా నిలబెడుతుందని అంచనా వేస్తున్నారు. గతంలో రెండు సినిమాలు వేసవిలో రావడం పెద్ద ప్లస్‌ పాయింట్‌. ఈసారి మాత్రం పరీక్షల సీజన్‌లో వస్తోన్న ఈ సినిమాలకి ఏ స్థాయి ఆదరణ లభిస్తుందనేది చూడాల్సిందే. రెండు సినిమాలపై దాదాపు నలభై కోట్ల బిజినెస్‌ ఆధారపడిందని ట్రేడ్‌ అంచనా.