‘అర్జున్ రెడ్డి’ గురించి మాట్లాడరేంటి?

అర్జున్ రెడ్డి.. అర్జున్ రెడ్డి.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. ఈ సినిమా సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. ఇటు కంటెంట్ విషయంలో అయినా.. అటు కలెక్షన్ల విషయంలో అయినా కళ్లు చెదిరేలా చేస్తోంది ‘అర్జున్ రెడ్డి’. తెలుగు సినిమా చరిత్రలో ‘అర్జున్ రెడ్డి’తో ఒక కొత్త అధ్యాయం మొదలైందని.. ఈ చిత్రం తెలుగు సినిమాను రీ డిఫైన్ చేసిందని.. ఇలా సోషల్ మీడియాలో ‘అర్జున్ రెడ్డి’ గురించి గొప్పగా చెబుతున్నారు జనాలు. విశ్లేషకులే కాదు.. సామాన్య ప్రేక్షకులు సైతం ఈ సినిమాను అలా ఇలా పొగడట్లేదు.

ప్రేక్షకులు స్వచ్ఛందంగా సోషల్ మీడియాలో సినిమా గొప్పదనాన్ని విశ్లేషిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డిని.. హీరో విజయ్ దేవరకొండను ఆకాశానికెత్తేస్తున్నారు. విజయ్‌ను అయితే కొత్త సూపర్ స్టార్ అని కూడా అంటున్నారు.
ఐతే ఇంత చర్చ జరుగుతున్న ‘అర్జున్ రెడ్డి’ గురించి ఇండస్ట్రీలోని పెద్దవాళ్లు మాత్రం ఏమీ మాట్లాడట్లేదు.

బన్నీ… మంచు లక్ష్మి.. సమంత లాంటి వాళ్లు.. ఇంకొందరు సెలబ్రెటీలు ‘అర్జున్ రెడ్డి’ని పొగిడారు తప్ప.. మామూలుగా ఓ పెద్ద కమర్షియల్ సక్సెస్ వచ్చినపుడు స్పందించే ఇండస్ట్రీ పెద్ద హీరోలు, దర్శకులు, నిర్మాతలు మాత్రం సైలెంటుగా ఉన్నారు. తెలుగు సినిమా నడతనే ప్రభావితం చేసే సినిమా వచ్చినపుడు ఈ పెద్దోళ్లు మాట్లాడకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మరి? రెగ్యులర్ సినిమాలకు చెక్ పెట్టేలా సినిమా ఉండటం.. సోకాల్డ్ స్టార్ హీరోల టాలెంట్‌ను ప్రశ్నించేలా విజయ్ నటన సాగడం.. ఇండస్ట్రీ జనాలకు నచ్చట్లేదేమో.

ఈ సినిమాపై కురుస్తున్న ప్రశంసలు.. పోటెత్తుతున్న కలెక్షన్లు ఇండస్ట్రీ పెద్దోళ్ల గుండెల్ని గుబేల్‌మనిపిస్తున్నాయేమో. వాళ్లందరూ ఇన్ సెక్యూర్‌గా ఫీలవుతున్నారేమో. అందుకేనా ఈ మౌనం?