థైస్ కి ఫిక్సయిపోతే బెటర్

రామ్ గోపాల్ వర్మ చివరగా ఎప్పుడు నిఖార్సయిన హిట్టు కొట్టాడో ఆయన వీరాభిమానులకు కూడా గుర్తు లేదు. గత దశాబ్ద కాలంలో ఆయన నుంచి చాలా కళాఖండాలు వచ్చాయి. వర్మ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఆయన మీద పూర్తిగా నమ్మకం కోల్పోయిన పరిస్థితి. దర్శకుడిగా ఆర్జీవీ ప్రమాణాలు ఎంత పడిపోయాయో చెప్పడానికి తాజా రుజువు.. సర్కార్-3. దశాబ్దం కిందట వచ్చిన ‘సర్కార్’ ఫస్ట్ పార్ట‌్‌ చూసి.. దీన్ని చూస్తే ఈ రెండూ తీసింది వర్మేనా అన్న సందేహం కలుగుతుంది. ‘సర్కార్-3’కి వచ్చిన ఫలితం చూశాక.. వర్మ సినిమాలపై జనాలకు ఎంతగా నమ్మకం పోయిందో అర్థమైంది. ఆయన సినిమాల్ని చూడ్డానికి జనాలు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదని తేలిపోయింది.

ఇలాంటి తరుణంలో వర్మ భవితవ్యం ఏంటి అని అందరూ సందేహాలు వ్యక్తం చేస్తుండగా.. ‘గన్స్ అండ్ థైస్’ అంటూ ఒక బ్యాంగ్ బ్యాంగ్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచాడు వర్మ. ఆరున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్.. నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ముంబయి మాఫియా మీద విపరీతమైన ఆసక్తి.. గొప్ప అవగాహన ఉన్న వర్మ ఆల్రెడీ ‘సత్య’, ‘కంపెనీ’ లాంటి సినిమాలతో అక్కడి వాతావరణాన్ని వెండితెరపై చాలా బాగా చూపించాడు. ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూపించలేని మరిన్ని కోణాల్ని వెబ్ సిరీస్‌ ద్వారా చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు వర్మ.

ఈ ట్రైలర్ చూస్తే వర్మ ఈజ్ బ్యాక్ అన్న ఫీలింగ్ కలుగుతోంది. వర్మ క్రెడిబిలిటీ బాగా పడిపోయిన నేపథ్యంలో ముంబయి మాఫియా మీద ఇప్పుడు ఎంత బాగా సినిమా తీసినా.. జనాల్ని థియేటర్లకు రప్పించడం కష్టమే. కానీ వెబ్ సిరీస్ అంటే అందరూ ఒక లుక్ వేస్తారు. వర్మ కూడా తన క్రియేటివిటీకి హద్దులు పెట్టుకోవాల్సిన పని లేదు. ఆ సంగతి ట్రైలర్లోనే స్పష్టమైంది. అమ్మాయిల్ని పూర్తి నగ్నంగా చూపించడానికి.. వయొలెన్స్ తనకు నచ్చిన స్థాయికి పెంచుకోవడానికి వర్మకు స్వేచ్ఛ లభించింది. సెన్సార్ గొడవ లేదు. ట్రైలర్లో చూసిన రా కంటెంట్‌ను ఇష్టపడేవాళ్లు ఆసక్తిగా వెబ్ సిరీస్‌ను చూస్తారు. పదేసి ఎపిసోడ్లతో నాలుగు సిరీస్ అంటున్నాడు కాబట్టి చాన్నాళ్ల పాటు వర్మ దీనికి ఎంగేజ్ అయిపోయేలా ఉన్నాడు. ఫినాన్షియల్‌గా కూడా బాగానే వర్కవుట్ అయ్యేట్లుంది కాబట్టి కాబట్టి అన్ని రకాలుగానూ వర్మకు ఇది మంచి మార్గం లాగే అనిపిస్తోంది.