ఫీల్డ్ లెవెల్ పోలీస్ ఆఫీసర్ల తో హీరో విజయ్ దేవరకొండ మాటామంతీ .
కరోనా సృష్టించిన విపత్తు లో ప్రాణాలకు తెగించి ఉద్యోగ భాద్యతలు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారులతో ముచ్చటించారు హీరో విజయ దేవరకొండ.హైదరాబాద్ కమీషనరేట్ లో సోమవారం సాయంత్రం ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ విపత్కర పరిస్థితుల్లో తమ విధులను నిర్వర్తిస్తూ నిజమైన హీరోలుగా నిలుస్తున్న పోలీసుల అధికారులను, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలకరించారు హీరో విజయ్ దేవరకొండ. నిరంతరం పనిచేస్తూ అలసట పొందుతున్న పోలీస్ సిబ్బందికి విజయ్ పలకరింపులు , మాటలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయని అధికారులను అన్నారు. ప్రతి రోజూ సాయంత్రం పోలీస్ కమీషనరేట్ లో జరిగే వీడియో కాన్ఫరెన్స్ లో విజయ్ పాల్గొనడం తో పోలీస్ అధికారులు, కానిస్టేబుల్స్ ఇతర సిబ్బందిలో కొత్త ఉత్సాహాం కనపడింది. ఈ సందర్భంగా పోలీస్ లు అడిగిన పలు ప్రశ్నలకు విజయ్ దేవరకొండ వారిని ఉత్సాహ పరుస్తూ సమాధానాలు చెప్పారు..
మీరు ఒకసారి పోలీస్ చెక్ పోస్ట్ ల దగ్గరకు వచ్చి ప్రజలను బయటకు రావొద్దని కోరాలి..
తప్పకుండా వస్తాను కానీ నేను వచ్చినప్పుడు మీ లాఠీలకు పనిచెప్పకూడదు అలాంటి పర్మీషన్ లెటర్ నాకు ఇస్తే తప్పకుండా వస్తాను.. కానీ మన సిఎం కేసీఆర్ సార్ చాలా క్లియర్ గా బయటకు రావొద్దు అని చెప్పారు.. వాళ్లు చెప్పాక కూడా బయట తిరిగే వాళ్ళకు మీ పద్దతిలోనే సమాధానం చెప్పాలి.. నేను వచ్చి చెబితే మంచి జరుగుతుంది అని మీరు నమ్మితే తప్పకుండా వస్తాను.
లాక్ డౌన్ పీరియడ్ లో మీరు మీ అమ్మకు సహాయం చేస్తున్నారా..?
నేను షూటింగ్ లలో బిజీ ఉండేటప్పుడు ఇంట్లో విషయాల్ని పట్టించుకునే వాడ్ని కాదు.కానీ ఇప్పుడు అమ్మ పడుతున్న కష్టం చూస్తే మాత్రం చాలా గొప్ప గా అనిపిస్తుంది. నేను సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు అమ్మ నీవల్ల మరింత పని పెరుగుతుందని కోప్పడుతుంది.. కానీ ఇలాంటి సమయంలో డ్యూటీలు చేస్తూ ఇంటి పనిని చక్క బెడుతున్న మహిళా అధికారులకు హేట్సాఫ్.
పోలీస్ అధికారిగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాము…
తప్పకుండా మంచి స్క్రిప్ట్ వస్తే చేస్తాను.. రెండు మూడు సంవత్సరాలలో మంచి పోలీస్ పాత్రతో మీ ముందుకు వస్తా..
మీరు పోలీస్ అయితే ఈ సిట్యువేషన్ లో ఎలా ఫీల్ అయ్యే వారు..?
చాలా బాధ్యతగా ఫీల్ అయ్యే వాడిని.. కమీషనర్ గారి ఆదేశాల మేరకు పనిచేసే వాడిని.మీరందరూ మా కోసం పనిచేస్తున్నారు.మేము ఇంట్లో కూర్చుంటే మీరు పనిగంటలు పెంచుకొని మా కోసం రోడ్ల మీద డ్యూటీలు చేస్తున్నారు మీ అందరికీ నా నమస్కారాలు.
మీరు డిప్రషన్ లో ఉంటే ఏం చేస్తారు..?
నా పనే నాకు గుర్తింపు నిచ్చింది. మీ అందరి ప్రేమనిచ్చింది.నాకు ఫెయిల్యూర్స్ వచ్చినా ఎప్పుడైనా లో ఫీల్ కలిగినా నా పని మీద మరింత ఫోకస్ చేస్తాను.నేను చిన్నప్పుడు మహాభారతం ప్లే చేసాను స్కూల్లో. అప్పుడు కృష్ణ భగవానుడు అన్న ఆ మాట నా మీద బాగా బలంగా పడింది.. ఈ సమయం గడిచిపోతుంది…నిజమే యే సమయం అయినా శాశ్వతం కాదు.. కరోనా కూడా అంతే మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కరోనా కూడా మన లైఫ్ లో ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
చాలా మంది పోలీస్ అధికారులు విజయ్ కి థ్యాంక్స్ చెబుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.. పోలీసులలో ఉత్సహాన్ని నింపేందుకు సమయం ఇచ్చిన విజయ్ దేవరకొండ కు పోలీస్ కమీషనర్ అంజన్ కుమార్ తో పాటు ఆయన సిబ్బంది కూడా కృతజ్ఞత లు తెలిపారు..