మ్మో.. ఆ హీరో చేతిలో అన్ని సినిమాలా?

‘పెళ్లిచూపులు’ సినిమా వచ్చే సమయానికి ఆ చిత్ర హీరో పేరు విజయ్ దేవరకొండ అని కూడా చాలామందికి తెలియదు. ‘ఎవడే సుబ్రమణ్యం’లో దూద్ కాశీ కుర్రాడిగానే అతను జనాలకు గుర్తున్నాడు. కానీ ‘పెళ్లిచూపులు’ విడుదలయ్యాక అతడి రేంజే మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో ఏ హీరోకూ లేనన్ని విజయ్‌కు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. రెండో.. మూడో కాదు.. ఏకంగా అతడి చేతిలో ఏడు కొత్త ప్రాజెక్టులుండటం విశేషం.

ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ‘ద్వారక’ను పక్కనబెట్టేస్తే.. ‘అర్జున్ రెడ్డి’ పేరుతో విజయ్ హీరోగా మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం వేసవికి విడుదలవుతుంది. దీని తర్వాత గీతా ఆర్ట్స్-యువి క్రియేషన్స్ కలిసి నిర్మించబోయే సినిమాలో అతనే కథానాయకుడు. మరోవైపు పరశురామ్ దర్శకత్వంలో విజయ్ హీరో గీతా ఆర్ట్సే మరో సినిమాను నిర్మించనుంది. ఇక ‘ప్రస్థానం’ ఫేమ్ దేవా కట్టా కూడా విజయ్‌తో ఓ సినిమాకు కథ రెడీ చేస్తున్నాడు. ఐతే దాని కంటే ముందు అతను ‘ప్రస్థానం’ హిందీ వెర్షన్ తీయాల్సి ఉంది. అదయ్యాక విజయ్ సినిమాను మొదలుపెడతాడు.

‘కళ్యాణ వైభోగమే’తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన నందిని రెడ్డి కూడా విజయ్‌తో ఓ సినిమా చేయబోతోంది. సునీల్‌తో ప్రస్తుతం ‘ఉంగరాల రాంబాబు’ తీస్తున్న క్రాంతి మాధవ్ కూడా విజయ్‌తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. వీళ్లందరూ కాక భరత్ కమ్మ అనే డెబ్యూ డైరెక్టర్‌తోనూ ఓ సినిమా చేయనున్నాడు విజయ్. ఇవన్నీ పూర్తి చేయడానికి అతను కనీసం రెండేళ్ల సమయం వెచ్చించాల్సిందే.