బాలీవుడ్‌పై క్రికెట‌ర్ల‌కు ఇంట‌రెస్ట్ పెరుగుతోందే!

నిజ‌మే… హిందీ చ‌ల‌న‌చిత్ర రంగం బాలీవుడ్‌పై క‌రిబీయ‌న్ కంట్రీ వెస్టిండిస్‌కు చెందిన క్రికెట‌ర్ల‌కు నానాటికీ ఆస‌క్తి పెరిగిపోతోంది. వెస్టిండిస్ క్రికెట్ జ‌ట్టులో కీల‌క ఆటగాడిగా ఉన్న డ్వేన్ బ్రావో బాలీవుడ్ తార‌ల‌తో సందడి చేసిన వైనం ఇంకా మ‌న క‌ళ్ల ముందు క‌ద‌లాడుతూనే ఉంది.

ఐపీఎల్ పుణ్య‌మా అని ఇత‌ర దేశాల క్రికెట‌ర్ల‌ను బాలీవుడ్ తార‌ల‌కు మ‌రింత చేరువ కాగా… ఇత‌ర దేశాల క్రికెటర్ల‌తో ఏమాత్రం పొంతన లేకుండా క‌రీబియ‌న్ క్రికెటర్లు… బాలీవుడ్‌తో మ‌మేకం అయ్యేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. డ్వేన్ బ్రావో ఇప్ప‌టికే బాలీవుడ్‌తో అత్యంత స‌న్నిహితంగా మెల‌గుతుండ‌గా… అత‌డి బాట‌లోనే వెస్టిండిస్ క్రికెట‌ర్ అండ్రూ ర‌స్సెల్ కూడా వ‌చ్చి చేరాడు.

ఓ మ్యూజిక్ వీడియోను విడుద‌ల చేయ‌డం ద్వారా ఇంట‌ర్నేష‌న‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగుపెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన ర‌స్సెల్… బాలీవుడ్‌పై త‌న మ‌న‌సులోని మాట‌ను చెప్పేశాడు. ‘కళల రంగంలో రాణించడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ ఏడాది లాంచ్‌ చేసే మొదటి ఇంటర్నేషనల్‌ మ్యూజిక్‌ వీడియోను ఎక్కువగా ఇండియాను దృష్టిలో ఉంచుకునే చేస్తున్నాం. ఆ తరువాత కుదిరితే బాలీవుడ్‌లో నటిస్తానేమో’ అని కాసేప‌టి క్రితం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో అత‌డు తెలిపాడు.

జస్టిన్‌ బీబర్‌ గ్రామీ అవార్డ్‌ విన్నింగ్‌ ఆల్బమ్ ‘సారీ’ కి ప్రొడక్షన్‌ హౌస్‌గా ఉన్న సంస్థనే రస్సెల్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ను ప్రొడ్యూస్‌ చేస్తోంది. అంటే ఈ వీడియో క్లిక్ అయ్యిందంటే… ర‌స్సెల్ దాదాపుగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్ట‌డం ఖాయమేన‌న్న మాట‌.