ఓం నమో… దిల్‌ రాజుకి పోయేదేమీ లేదు

ఈ ఏడాదిలో మూడు వారాల వ్యవధిలో రెండు బ్లాక్‌బస్టర్లు అందించి ఊపు మీదున్న దిల్‌ రాజు పట్టిందల్లా బంగారమే అంటూ అంతా కొనియాడుతున్నారు. నిర్మాతగా జోరు మీదున్న దిల్‌ రాజుకి పంపిణీ రంగంలో మాత్రం ఏదీ కలిసి రావడం లేదు. అతను రిలీజ్‌ చేసిన ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రం భారీ నష్టాలని చవిచూసే దిశగా సాగుతోంది.

నైజాంలో ఈ చిత్రాన్ని తొమ్మిది కోట్లకి దిల్‌ రాజు తీసుకున్నాడు. దీంతో దిల్‌ రాజుకి భారీ నష్టం ఖాయమంటూ, నిర్మాతగా వచ్చిన లాభాల్లోంచి కొంత ఇది పట్టుకుపోతుందని మాట్లాడుకుంటున్నారు. కానీ దిల్‌ రాజు తెలివిగా ‘అడ్వాన్స్‌’ పద్ధతిలో ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రాన్ని రిలీజ్‌ చేసాడు.

మామూలుగా పెద్ద చిత్రాలకి నాన్‌ రిఫండబుల్‌ అడ్వాన్స్‌ పద్ధతిలో రిలీజ్‌ చేస్తారు. అంటే సినిమాకి నష్టమొచ్చినా కానీ దానిని బయ్యరే భరించాలి కానీ నిర్మాతకేమీ సంబంధం వుండదన్నమాట. అడ్వాన్స్‌ పద్ధతిలో విడుదల చేస్తే, బయ్యర్‌కి జరిగిన నష్టాన్ని నిర్మాత భర్తీ చేయాల్సి వుంటుంది. ‘ఓం నమో వెంకటేశాయ’తో అయిదారు కోట్లు పోయినా కానీ అవి నిర్మాత నుంచి తిరిగి వచ్చేస్తాయి కాబట్టి దీంతో దిల్‌ రాజు పోగొట్టుకునేదేమీ లేదు.

నిర్మాతగా అన్నీ సాలిడ్‌ ప్రాజెక్టులు సెట్‌ చేస్తోన్న దిల్‌ రాజు పంపిణీ రంగంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. గతంలో మాదిరిగా పెద్ద సినిమాల రైట్స్‌ కోసం అతను పరుగులు తీయడం లేదు. అందులో లాభం కంటే రిస్కే ఎక్కువ వుండడంతో నిర్మాణమే బెస్ట్‌ అని దిల్‌ రాజు తెలుసుకున్నాడు.