ఎన్టీఆర్‌ రేంజ్‌ తగ్గిస్తున్న డైరెక్టర్‌

ఒక స్టార్‌ హీరోకి స్టార్‌ డైరెక్టర్‌ జతగా వుంటే తప్ప ఇప్పుడు బిజినెస్‌ క్రేజ్‌ రావడం లేదు. ఉదాహరణకి పవన్‌, త్రివిక్రమ్‌ల సినిమాకి నూట ఇరవై కోట్ల బిజినెస్‌ జరిగిందని టాక్‌. అదే సమయంలో అతని గత చిత్రం కాటమరాయుడు మాత్రం ఎనభై అయిదు కోట్ల రేంజితో సరిపెట్టుకుంది. కేవలం దర్శకుడి కారణంగానే పవన్‌ తదుపరి చిత్రానికి దాదాపు నలభై కోట్ల అడ్వాంటేజ్‌ దక్కుతోంది. ఈ విషయాన్ని పట్టించుకోకుండా ‘జై లవకుశ’ చిత్రానికి పవన్‌-త్రివిక్రమ్‌, మహేష్‌ ‘స్పైడర్‌’ చిత్రాలతో సమానమైన రేట్లు డిమాండ్‌ చేస్తున్నారని, అంచేత దీనికి ఇంతవరకు బిజినెస్‌ క్లోజ్‌ అవలేదని ట్రేడ్‌ టాక్‌.

జైలవకుశ దర్శకుడు బాబీ గత చిత్రం ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ ఫ్లాప్‌ అవడమే కాకుండా, అతని పేరిట ఇంతవరకు భారీ విజయం లేదు. అతని పేరు వల్ల సినిమాకి వచ్చే అదనపు ఆకర్షణ ఏమీ వుండదు. అందుకే టీజర్‌తో ఎన్టీఆర్‌ అంత ఆకట్టుకున్నప్పటికీ, ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నప్పటికీ బయ్యర్లు భారీ స్థాయిలో దీనిపై పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా లేరు.

కళ్యాణ్‌రామ్‌ మాత్రం మార్కెట్‌ రేటుకి మరో ముప్పయ్‌ శాతం ఎక్కువే రేట్లు అడుగుతున్నాడని, అతను దిగి వస్తే తప్ప ఈ చిత్రానికి రేటు పలకదని అంటున్నారు. మరి కళ్యాణ్‌రామ్‌ దిగొస్తాడా లేక సొంతంగా విడుదల చేసుకుంటాడా?