రవితేజ ఏం చెప్పుకున్నా చెల్లదు

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ తమ్ముడు భరత్ యాక్సిడెంట్లో చనిపోవడం కంటే కూడా.. అతడి అంత్యక్రియలకు రవితేజ హాజరు కాకపోవడమే ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. రవితేజే కాదు.. అతడి తల్లి సైతం తన చిన్న కొడుకు అంత్యక్రియలకు హాజరవకపోవడం చర్చనీయాంశం అయింది.

తమ్ముడితో ఉన్న అనుబంధం దృష్ట్యా.. ప్రమాదంలో ఛిద్రమైన అతడి ముఖాన్ని చూడలేక.. విగతజీవి అయిన తన తమ్ముడిని చూసి తట్టుకునే శక్తి లేకే రవితేజ అంత్యక్రియలకు రాలేదని అతడి సన్నిహితులు చెబుతున్న వాదన సమర్థనీయం అనిపించట్లేదు.

కుటుంబ సభ్యులు ఎలాంటి స్థితిలో చనిపోయినా కడసారి చూపు చూసుకోవాలని.. అంత్యక్రియల్ని పద్ధతి ప్రకారం జరిపించాలని ఎవ్వరైనా అనుకుంటారు. బడా నేరస్థులు.. ఉగ్రవాదులు కోల్పోయినా.. వారి కుటుంబ సభ్యులు పద్థతి ప్రకారమే అంత్యక్రియలు జరిపిస్తారు. అలాంటిది రవితేజ కుటుంబం ఇలా అంత్యక్రియల్నిఅవాయిడ్ చేయడమేంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.

భరత్ కొన్ని సార్లు డ్రగ్స్ కేసుల్లో చిక్కుకోవడం.. అతడి చుట్టూ మరికొన్ని వివాదాలుండటం తెలిసిందే. కష్టపడి పైకెదిగి ఏ వివాదం లేకుండా సాగిపోతున్న రవితేజకు భరత్ లేని పోని వివాదాలతో చెడ్డపేరు తెస్తున్నాడని పలుమార్లు మీడియాలో చర్చ నడిచింది. భరత్ ఖర్చుల్ని కూడా రవితేజే భరించేవాడని అంటారు. ఈ నేపథ్యంలో రవితేజ అయిష్టతతోనే తమ్ముడి కడసారి చూపుకు రాలేదన్న వాదనా వినిపిస్తోంది.

ఐతే కారణాలు ఏమైనా అయ్యుండొచ్చు గాక.. కానీ ఒక ప్రముఖ హీరో తమ్ముడు కుటుంబ సభ్యుల కడచూపుకే నోచుకోకపోవడం.. అనాథ శవంలా అతడి అంత్యక్రియలు జరగడం మాత్రం దారుణమైన విషయమే. అతడి పార్థివ దేహానికి ఓ జూనియర్ ఆర్టిస్టుతో తలకొరివి పెట్టించారని జరుగుతున్న ప్రచారం నిజమే అయితే అంత కంటే విచారకరమైన విషయం మరొకటి ఉండదు.